Share News

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:38 AM

పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

  • మెమోల్లో గ్రేడ్ల స్థానంలో మార్కులు

  • పాఠశాల విద్యా శాఖ నిర్ణయం.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

  • ఈసారి జారీ చేయనున్న మెమోల్లోనే అమలుకు నిర్ణయం

  • సర్కారు నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాల అభ్యంతరం

  • విద్యార్థులపై ఒత్తిడి పెంచే నిర్ణయాన్నితీసుకోవడం ఏమిటని విమర్శలు

  • నేడు ఫలితాలు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు కనిపించనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్‌ రెడ్డి రవీంద్రభారతిలో విడుదల చేయనున్నారు. కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన మెమోల్లో మార్కులనే పేర్కొననున్నారు. అలాగే, 20 ఇంటర్నల్‌ మార్కులకూ ఇంతవరకూ గ్రేడింగ్‌ విధానమే ఉండగా.. దీని స్థానంలో మార్కులు ప్రకటించనున్నారు. కొత్త మెమో నమూనాను పాఠశాల విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తామని అందులో అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి ఫలితాలను పాస్‌, ఫెయిల్‌ అని స్పష్టంగా పేర్కొననున్నారు. అయితే, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఎవరితోనూ సంప్రదించకుండా విద్యా శాఖ ఏకపక్షంగా, అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.


విద్యార్థులపై మార్కుల ఒత్తిడిని తగ్గించాలని విద్యావేత్తలు, మానసిక నిపుణులు కోరుతుంటే.. వారిపై మరింత ఒత్తిడిని పెంచే నిర్ణయాన్ని విద్యా శాఖ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, విద్యార్థులపై మార్కుల ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే దశాబ్దంన్నర కిందట ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. 2009-10 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తెచ్చారు. ఉదాహరణకు.. 91-100 మధ్యలో ఎన్ని మార్కులు వచ్చినా ఏ-1 గ్రేడ్‌ ఇచ్చేవారు. 81-90 మార్కులకు ఏ-2; 71-80కి బి-1, 61-70కి బి-2, 51-60 సి-1, 41-50 సి-2, 35-40 డి, 35 మార్కులు తగ్గితే గ్రేడ్‌-ఈ ఇచ్చేవారు. మొత్తం మార్కుల స్థానంలో సీజీపీఏ (క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌) సైతం గ్రేడింగ్‌లోనే ప్రకటించేవారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అప్పటి ప్రభుత్వం విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించి గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, అకస్మాత్తుగా దీనిని తొలగిస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు కొత్త విధానం ప్రారంభించడం వెనక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని నిలదీస్తున్నారు.


విద్యార్థులపై మరింత ఒత్తిడి

- శ్రీపాల్‌ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

పదో తరగతిలో మార్కుల విధానం విద్యార్థులపై ఒత్తిడి మరింత పెంచనుంది. గ్రేడింగ్‌ విధానం విద్యార్థులకు ఎంతో మేలు కలిగించింది. కొత్త విధానంతో సమస్యలు పెరుగుతాయి. ప్రస్తుతం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో గ్రేడింగ్‌ విధానమే అమల్లో ఉంది. మార్కులు ప్రకటించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

సంఘాలన్నీ వ్యతిరేకించాయి

- చావ రవి, అధ్యక్షుడు, టీఎస్‌యూటీఎఫ్‌

పదో తరగతి మెమోలో మార్కుల విధానం తెచ్చే ఆలోచన ఉందని విద్యా శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు బుర్రా వెంకటేశం ఓసారి సంఘాలతో ప్రస్తావించారు. దానిని అప్పుడే అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించాం. అలా చేస్తే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేశాం. కానీ, సంఘాలు, విద్యావేత్తలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే విద్యా శాఖ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఇది కార్పొరేట్‌ కాలేజీలకు లబ్ధి కలిగించేందుకు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలి.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 08:09 AM