Peddapalli: ఇసుక రీచ్‌లలో.. ఇష్టారాజ్యం!
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:10 AM
పెద్దపల్లి జిల్లాలోని తాడిచర్ల బ్లాక్-2 గోపాల్‌పూర్ ఇసుక రీచ్.. సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుని.. డబ్బు చెల్లించి ఆర్డర్ కాపీ (ఓఆర్‌డీ) తీసుకోవాలి. కానీ, ఈ రీచ్‌లో లోడింగ్ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం.

ఆర్డర్ కాపీలు లేకున్నా లారీల్లో లోడింగ్.. ఒక్కో లారీలో 50 టన్నులకు పైనే..
లారీకి రూ.50 వేల వరకు వసూలు
రీచ్‌ల్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు
లారీలను ఓఆర్‌ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే
విజిలెన్స్, ఆర్టీఏ, పోలీసు కనుసన్నల్లోనే తతంగం
బీఆర్‌ఎస్ హయాం నుంచీ కొనసాగుతున్న దందా
ఆన్‌లైన్‌లో చూపని రీచ్‌ల్లోనూ విక్రయాలు
‘శివన్నగూడెం’ వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్‌కు
లారీల జీపీఎ్‌సను కార్లకు అమర్చి తప్పుదోవ
కొన్ని చోట్ల సన్న ఇసుక పేరిట అదనపు వసూళ్లు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలోని తాడిచర్ల బ్లాక్-2 గోపాల్‌పూర్ ఇసుక రీచ్.. సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుని.. డబ్బు చెల్లించి ఆర్డర్ కాపీ (ఓఆర్‌డీ) తీసుకోవాలి. కానీ, ఈ రీచ్‌లో లోడింగ్ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం. ఎలాంటి ఓఆర్‌డీలు లేకుండానే ప్రతి రోజూ రాత్రి 200 లారీల్లో ఇసుక నింపుతారు. ఒక్కో లారీకి రూ.50వేల వరకు తీసుకుంటారు. హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు చేరే దాకా తమదే బాధ్యత అని భరోసా ఇస్తారు. ఏకకాలంలో బయలుదేరే ఈ వాహనాలు ఉదయం 9గంటల కల్లా ఔటర్‌కు చేరుతాయి. భారీ ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను ఆయా జిల్లాల్లోని ఆర్టీఏ, మైనింగ్ విజిలెన్స్, పోలీసులు.. ఇలా ఏ అధికారి కూడా ఆపే ధైర్యం చేయరంటే అక్రమ దందా ఏ తీరులో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి రాజధానికి చేరుకుని, ఇసుక అడ్డాపై లారీని నిలిపాక.. ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేయకపోవడం.. వారికి బాగా కలిసొస్తుంది. ఇదంతా ఈ ఒక్క రీచ్‌లో జరుగుతున్నది కాదు.. పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్-1, తాడిచెర్ల బ్లాక్-2లోని ఖమ్మపల్లి, ఉటూరు, చల్లూరుతోపాటు ములుగు జిల్లాలోని బోరె నర్సాపూర్ ఇసుక రీచ్‌ల్లో ఇలాంటి అక్రమాలు నిత్య కృత్యంగా సాగుతున్నాయి. ఉదాహరణకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు టీఎ్‌సఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది.
అందులో పెద్దపల్లి జిల్లా తాడిచర్ల బ్లాక్-2లోని గోపాల్‌పూర్ ఇసుక రీచ్‌లో 33 లారీల్లో నింపాల్సిన 1,110 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్‌లైన్‌లో పెట్టారు. కానీ, క్షేత్ర స్థాయిలో లోడింగ్‌కు వందకు పైగా లారీలు బారులు తీరినట్లు అక్కడికి లోడింగ్‌కు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ ’ఆంధ్రజ్యోతి ప్రతినిధికి’ ఫోన్ చేసి వివరించారు. ఓఆర్‌డీలు లేని వాహనాలకు కూడా లోడింగ్ చేస్తున్నారని వాపోయారు. ఇసుకను లోడింగ్ చేసుకోవడానికి గురువారం అర్ధరాత్రే తాను ఇసుక రీచ్‌కు చేరుకోగా.. శుక్రవారం సాయంత్రానికి లోడింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ విధంగా రోజువారీగా టీఎ్‌సఎండీసీలో బుకింగ్ చేసే లారీలకు.. ఇసుక రీచ్‌ల్లో లోడింగ్ చేసే వాహనాలకు భారీగా వ్యత్యాసం ఉంటుంది. 12టైర్ల లారీలో 26 టన్నులు, 14టైర్ల లారీలో 32టన్నులు, 16టైర్ల లారీకి 35టన్నులు మాత్రమే ఇసుక లోడింగ్ చేయాల్సి ఉండగా.. ఇష్టానుసారం ఒక్కో లారీలో సామర్థ్యానికి మించి 50 టన్నులకుపైగా లోడింగ్ చేస్తున్నారు. ఇక, కరీంనగర్ జిల్లాలోని వావిలాల, సూర్యాపేట జిల్లాలోని వంగమర్తి, ఖమ్మం జిల్లాలోని ఓ వాగులో ఉన్న ఇసుక రీచ్‌ల వివరాలు టీజీఎండీసీ వెబ్‌సైట్‌లో కనిపించవు. కానీ, ప్రతి రోజూ ఒక్కో ఇసుక రీచ్ నుంచి వందకుపైగా లారీలు ఇసుకను లోడింగ్ చేస్తున్నాయి.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష తర్వాత కరీంనగర్ జిల్లాలోని వావిలాల ఇసుక రీచ్‌లో లోడింగ్‌ను ఆపేశారు. కానీ, సూర్యాపేట జిల్లాలోని వంగమర్తి, ఖమ్మంలోని వాగులో నుంచి ఇసుక తరలింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాలోని వాగు నుంచి తీసే ఇసుకను ఖమ్మం, కోదాడ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. పాత ఓఆర్‌డీలతో, ఒకే నంబర్ ప్లేట్‌తో పదుల సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. ఇక, సూర్యాపేట జిల్లాలోని వంగమర్తి ఇసుక రీచ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెం ప్రాజెక్టుకు కేటాయించింది. కానీ, లోడింగ్ కాంట్రాక్టర్లు లారీ యజమానులతో కుమ్మక్కై హైదరాబాద్‌కు ఇసుకను తరలించేస్తున్నారు. వంగమర్తిలో ఇసుకను లోడ్ చేసుకున్న వాహనాలను జీపీఎస్ ద్వారా మానిటరింగ్ చేసే వ్యవస్థను రూపొందించారు. అయితే, చౌటుప్పల్ దాటాక లారీల్లోని జీపీఎస్ యంత్రాలను తొలగించి.. కార్లలో శివన్నగూడెం ప్రాజెక్టు వరకు వెళ్తున్నారు. ఇసుక లారీలు మాత్రం యథేచ్ఛగా జీపీఎస్ లేకుండా రాజధానికి వస్తున్నాయి. ఇదంతా గత ప్రభుత్వ హయాం నుంచీ సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఆర్టీఏ, మైనింగ్ విజిలెన్స్, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది.
సన్న ఇసుక పేరిట వసూళ్లు
భూపాలపల్లి జిల్లాలోని బొమ్మాపూర్, ఎలికేశ్వరం ఇసుక రీచ్‌ల్లో దొడ్డు రకం ఇసుక దొరుకుతుందని ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. దొడ్డు ఇసుక కావాల్సిన లారీ యజమానులు బుకింగ్ చేసుకొని ఇసుక రీచ్‌లకు చేరితే వింత పరిస్థితి ఎదురవుతోంది. దొడ్డు ఇసుక స్థానంలో సన్న ఇసుక నింపుతున్నామంటున్న లోడింగ్ కాంట్రాక్టర్లు.. ఒక్కో లారీకి అదనంగా రూ.3-5వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై ఇటీవల కొందరు లారీల డ్రైవర్లు ఎదురుతిరగ్గా.. లోడింగ్ చేసేది లేదంటూ బొమ్మాపూర్ ఇసుక రీచ్ లోడింగ్ కాంట్రాక్టర్ వాగ్వాదానికి దిగారు. వాస్తవానికి ఇసుక సన్నదైనా, దొడ్డుదైనా టన్నుకు రూ.375 మాత్రమే టీజీఎండీసీ వసూలు చేస్తోంది. కానీ, ఇసుక రీచ్‌ల్లో సన్న ఇసుక అయితే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం వెళ్తే..
హైదరాబాద్‌లో ప్రస్తుతం సన్న ఇసుక టన్ను ధర రూ.1700, దొడ్డు ఇసుక టన్ను ధర రూ.1600 ఉంది. నిబంధనల ప్రకారం లోడింగ్ చేసుకొని వచ్చే లారీలకు ఒక ట్రిప్పుకు రూ.6వేలు కూడా మిగలడం లేదు. 12టైర్ల లారీకి ఆన్‌లైన్‌లో టీజీఎండీసీ నుంచి ఓడీఆర్ పొందేందుకు రూ.10,756 చెల్లించాలి. భూపాలపల్లి వెళ్లి వస్తే టోల్‌గేట్ల ఖర్చు రూ.2700, డీజిల్ ఖర్చు రూ.15వేలు, డ్రైవర్‌కు రూ.4500, లేబర్‌కు, కాంటా చార్జీలు ఇతరత్రా రూ.2200తో కలిపి రూ.35,156 దాకా ఖర్చవుతోంది. 26టన్నుల ఇసుకను రూ.1600 చొప్పున విక్రయిస్తే వచ్చేది రూ.41,600. ఈ విధంగా ఒక ట్రిప్పు ద్వారా నిబంధనల ప్రకారం లోడింగ్ చేసుకునే లారీ యజమానికి రూ.6,444 మాత్రమే మిగులుతోంది. ఈ క్రమంలో టైర్ పగిలినా.. మరమ్మతుకు గురైనా ఆ వచ్చే ఆదాయం కూడా రాదు. అదే 12టైర్ల లారీ ఓవర్ లోడ్‌తో వస్తే.. తక్కువ ధరకు విక్రయించినా రూ.10వేల నుంచి రూ.15వేల వరకు మిగులుతోంది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న తమకు ఏమీ మిగలడం లేదని లారీల యజమానులు వాపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Big Scam: భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వీళ్ల ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad: బాబోయ్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన