Supreme Court: ‘గ్రూప్స్’ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తాం
ABN , Publish Date - May 17 , 2025 | 04:08 AM
తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్ వేశారు.

పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభావం
పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
న్యూఢిల్లీ, మే 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్ వేశారు. వారిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. ఉద్దేశ పూర్వకంగా నియామకాలను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 370 పేజీల రిట్ పిటిషన్‌తో కుమ్మరి ప్రవీణసహా 12 మంది ఏప్రిల్ 30న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దివ్యాంగుల రిజర్వేషన్లు వర్టికల్ విధానంలో అమలు చేశారని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రత్యేకించి.. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 రాజ్యాంగ బద్దమా? కాదా? అనేది తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో 33 ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు సరికాదని తెలిపారు. ఆ పిటిషన్ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జీ బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, ఏవోఆర్ దేవినా సేఘల్, ఉదయ్ భాను, పిటిషనర్ల తరఫున రాణా ముఖర్జీ హాజరయ్యారు. గ్రూప్ -1 నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నదని, పరీక్ష ముగిసిందని, నియామక పత్రాలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జీవో 29 రద్దు అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని తెలిపారు. కేవలం ఉద్దేశపూర్వకంగానే నియామక ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని వాదించారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అనుమతించింది.