Jayesh Ranjan: అశ్లీల ‘యూట్యూబ్’ చానళ్లను తొలగిస్తాం
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:49 AM
అశ్లీల, అసభ్య యూట్యూబ్ చానళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.

పోలీసుశాఖతో కలిసి ప్రత్యేక కార్యాచరణ
ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అశ్లీల, అసభ్య యూట్యూబ్ చానళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. యూట్యూబ్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అశ్లీలత హద్దులు దాటుతోందని, వీటిని నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ‘బూతులే బంగారు బాతులు’ శీర్షికన ఈనెల 18న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. గురువారం హైదరాబాద్‌లోని వీ-హబ్‌లో జరిగిన గ్రామీణ మహిళా స్టార్టప్ శిక్షణ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జయేశ్ రంజన్.. 3 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధృవపత్రాలు అందించారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘యూట్యూబ్, ఏ ఇతర సామాజిక మాధ్యమమైనా కానివ్వండి.. వాక్ స్వాతంత్య్రం పేరుతో అశ్లీల, అసభ్య వీడియోలు రూపొందించడం, దేశ సమగ్రతకు భంగం కలిగించే వీడియోలు, వ్యక్తిగత భద్రతకు సంబంధించినవి, కులం, మతం, లింగ వివక్ష, బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలు రూపొందించడం చట్టరీత్యా నేరమే.. పోలీసు శాఖతో కలిసి ఇలాంటి వీడియోలను యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగిస్తాం. దీనికోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణ చేపడతాం’ అని వెల్లడించారు.