Share News

Bhupalpally: రాజలింగమూర్తి హత్యకేసులో వీడని చిక్కుముడి!

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:58 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో చిక్కుముడి వీడడం లేదు.

Bhupalpally: రాజలింగమూర్తి హత్యకేసులో వీడని చిక్కుముడి!

  • బీఆర్‌ఎస్‌ నేత పాత్ర పైనే పోలీసుల దృష్టి

  • పరారీలో సదరు నేత? అదుపులో వీఆర్‌ఏ

  • ఇద్దరు రేషన్‌ డీలర్లు కూడా

  • మరో రియల్టర్‌పై అనుమానాలు!

భూపాలపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో చిక్కుముడి వీడడం లేదు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులుగా భావిస్తున్న ఐదుగురితోపాటు బీఆర్‌ఎస్‌ నేత, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు పాత్రపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం. హత్య జరిగిన తర్వాత.. కాల్‌ డేటా రికార్డ్‌(సీడీఆర్‌)ను విశ్లేషిస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ నేత పాత్రపై అనుమానాలు బలపడ్డాయని తెలుస్తోంది. హత్య జరిగినప్పటి నుంచి హరిబాబు పరారీలో ఉండడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయని విశ్వసనీయవర్గాలు చెప్పా యి. బుధవారం సాయంత్రం 7.15 గంటల సమయంలో హత్య జరగ్గా.. నిందితుల్లో ఒకరైన రేణిగుంట్ల సంజీవ్‌(ఏ1).. హరిబాబును ఫోన్‌ద్వారా సంప్రదించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.


హరిబాబు కాల్‌ డేటాను విశ్లేషించి, ఆ రోజు మాట్లాడిన వ్యక్తులందరినీ పిలిపించి.. విచారించారు. ఈ క్రమంలో భూపాలపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు రేషన్‌ డీలర్లు, ఒక వీఆర్‌ఏ, గణపురం మం డలం చెల్పూరుకు చెందిన ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి పేర్లు తెరపైకి వచ్చినట్టు సమాచారం. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరిపారు. వీరిలో ఓ వ్యక్తి ఫోన్‌ నుంచి హత్య జరిగిన సమయంలో ఫోన్‌కాల్‌ వెళ్లినట్లు గుర్తించారు. రేషన్‌ డీలర్లు, వీఆర్‌ఏ విచారణలో.. హత్యతో వారికి సంబంధాలున్నట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరిబాబుకు అత్యంత సన్నిహితులైన ఖాశీంపల్లికి చెందిన ఇద్దరు ప్రధాన అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. రాజలింగమూర్తి హత్య వెనక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. కాగా.. హరిబాబు గతంలోనూ వివాదాస్పద కేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌ హోదాలో జిల్లాలో పాదయాత్ర జరిపినప్పుడు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ కేసులో హరిబాబు ప్రధాన నిందితుడు. రాజలింగమూర్తి హత్యకేసులోనూ హరిబాబు పేరే ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. చివరి నిమిషంలో రద్దుచేసుకుని, ఆదివారానికి వాయిదా వేశారు.

Updated Date - Feb 23 , 2025 | 04:58 AM