Share News

SLBC: సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:21 AM

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ సహాయంతో.. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీని గుర్తించారు.

SLBC: సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

  • 2 చోట్ల ఉన్నట్లు గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌తో గుర్తింపు

  • నేడు నలుగురిని తీస్తుకొస్తాం.. తర్వాత మిగతా వారిని..

  • ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువే: జూపల్లి

  • ఢిల్లీ నుంచి మరో 14 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌: ఉత్తమ్‌

మహబూబ్‌నగర్‌/దోమలపెంట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ సహాయంతో.. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీని గుర్తించారు. రెండు వేర్వేరు చోట్ల నలుగురు చొప్పున ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. అయితే వీరంతా ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని తెలుస్తోంది. 8 మందిని గుర్తించినా పెద్దమొత్తంలో బురద పేరుకుపోవడంతో వారిని బయటకు తేవడం సమస్యగా మారింది. ఎనిమిది మంది ప్రాణాలతో ఉండటంపై ఆశలు తక్కువగా ఉన్నాయని, తాము వారంతా బతికి ఉన్నారనే భావిస్తూ, బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చిక్కుకుపోయిన వారిలో నలుగురు టన్నెల్‌ బోరింగ్‌ మిషిన్‌ (టీఎంసీ) బయట భాగంలో.. మరో నలుగురు టీఎంసీ కింది భాగంలో ఉన్నట్లు గుర్తించారు. శనివారం దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి సమీక్షలో పాల్గొన్న అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యల్లో చాలా పురోగతి సాధించామని.. ఆదివారం రాత్రి వరకు నలుగురిని, తర్వాత రోజుల్లో టెన్నెల్‌ కింద చిక్కుకుపోయిన నలుగురిని బయటకు తీసుకొస్తామని పేర్కొన్నారు.


టీబీఎం కటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక, అక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించాకే మిగతా నలుగురిని బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. టీబీఎం వద్ద 24 ఫీట్ల మేర బురదమట్టి ఉందని, అది 450 అడుగుల మేర ముందుకు వచ్చిందని జూపల్లి వెల్లడించారు. మిషిన్‌ కటింగ్‌ కూడా వేగంగా జరుగుతోందని తెలిపారు. సహాయక చర్యల్లో 11 ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు గతంలో జరిగితే సందర్శనకు వెళ్లాలనుకున్న విపక్ష నేతలను గత ప్రభుత్వాలు హౌజ్‌ అరెస్టు చేయించాయని.. తాము ప్రతి ఒక్కరికి సహాయక చర్యలను పరిశీలించడానికి అవకాశమిచ్చామని చెప్పారు. 200 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వామని చెప్పుకుంటున్న వారు ఎస్‌ఎల్‌బీసీలో ఆ మిగతా 9కి.మీ ఎందుకు పూర్తి చేయలేదు? బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. కాగా ఇక్కడ.. జీఎ్‌సఐ సర్వే తర్వాత మాత్రమే పనులు పునఃప్రారంభించామని స్పష్టం చేశారు. కాగా సహాయక చర్యల్లో ఇప్పటికే 14మంది ర్యాట్‌ ఫిల్లింగ్‌ మైనర్స్‌ పాల్గొంటుండగా.. మరో 16మందిని ఢిల్లీ నుంచి రప్పించాలని అఽధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. టీబీఎం మిషిన్‌ భాగాలను టన్నెల్‌ నుంచి బయటకు పంపించే ప్రక్రియను ముమ్మరం చేశామని, ఇందుకు మధ్యప్రదేశ్‌ నుంచి మరో 14 మంది ప్లాస్మాకట్టర్లను రప్పించినట్లు ఉత్తమ్‌కు అధికారులు వివరించారు.


సహాయక చర్యల్లో 200 మంది సింగరేణి కార్మికులు

టన్నెల్‌ నుంచి నీళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందులో పేరుకుపోయిన మట్టిని తీయడానికి చాలా సమయం పడుతోంది. మట్టి తీస్తున్నాకొద్దీ ఊటనీరు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షిప్టుకు 60 కార్మికుల చొప్పున సింగరేణి నుంచి వచ్చిన 200 మంది కార్మికులు మట్టి తవ్వకం, బురద తొలగింపు పనులు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు ఐదు మీటర్ల మేర బురద పేరుకుపోయింది. కొన్నిచోట్ల అది గట్టిగా మారింది. ఇప్పటిదాకా దాదాపు రెండు మీటర్ల మేర మాత్రమే తవ్వగలిగారు. బుదరను బయటకు తీసుకువచ్చేందుకు కంటెయినర్లు చాలా తక్కువగా ఉన్నాయి. మాన్యువల్‌ పద్ధతిలో కార్మికులు బురదను నింపుతుండటంతో చాలా సమయం పడుతోంది. ఇప్పటికే అందులో ఒక ఎక్స్‌కవేటర్‌, రెండు బాబ్‌ క్యాట్‌ యంత్రాలు ఉండగా శనివారం ఒక భారీ ఎక్స్‌కవేటర్‌ను టన్నెల్‌లోపలికి తీసుకెళ్లారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదానికి భయపడి కార్మికులంతా తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. వారికి మూడు నెలల వేతనాలను కంపెనీ చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది.


ఎస్‌ఎల్‌బీసీ ఘటనకు సర్కారుదే బాధ్యత: ఏలేటి

దోమలపెంట: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని.. కార్మికులకు ఏదైనా జరిగితే ప్రభుత్వ హత్యలుగానే భావిస్తామని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. దోమలపెంట వద్ద ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను బీజేపీ ఎమ్మెల్యేల బృందం శనివారం పరిశీలించింది. అధికారులతో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకుంది.


ఇవి కూడా చదవండి...

Tunnel Rescue Operations: టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. కీలక దశకు రెస్క్యూ ఆపరేషన్

T.High Court: మల్టీప్లెక్స్‌లకు ఊరట... ఆ ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 02 , 2025 | 04:21 AM