Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్ కాల్చివేత
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:38 AM
అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మఢ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం!
ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ స్వాధీనం
వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ
ఏడాది కాలంలో 357 మంది మృతి
చర్ల, చింతూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మఢ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. అబూజ్‌మఢ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో.. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూబింగ్ చేపట్టాయని వివరించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, బలగాల మధ్య కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. నక్సల్స్ వైపు కాల్పులు నిలిచిపోయాక.. పరిశీలించగా.. ఆరు మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఒక ఏకే-47, మరో ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కూంబింగ్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు గుర్తుచేస్తున్నారు. ఆ ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతిచెందారు. శుక్రవారం అదే ప్రాంతంలో కాల్పులు జరిగాయి. శుక్రవారం మృతిచెందిన వారిలో పీఎల్‌జీఏ ఏడో బెటాలియన్ సభ్యులై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సారి కూడా బస్తర్ అడవుల్లో వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్‌కౌంటర్ జరగడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా బలగాలు భావిస్తున్నాయి. కాగా.. ఆపరేషన్ కగార్‌లో భాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడాది కాలంలో 357 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో 126 మంది మహిళలు, నలుగురు కేంద్ర కమిటీ, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులున్నారు.