Vemuri Radhakrishna: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి ఎండీ వాంగ్మూలం
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:50 AM
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్ధల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు గురువారం నోటీసు జారీ చేశారు.

సిట్ ఆఫీసులో ఉదయం 11కు హాజరు
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికీపిలుపు
అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లో బాధితులెందరో!
ఎస్‌ఐబీ సీడీఆర్‌లో 615 ఫోన్ నంబర్లు
సీడీఆర్ ఆధారంగా వాంగ్మూలాల నమోదు
పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించడానికి సిట్‌ప్రయత్నం
హైదరాబాద్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్ధల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు గురువారం నోటీసు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని కోరారు. ఎస్‌ఐబీ వద్ద ఉన్న కాల్ డిటైల్ రికార్డ్స్(సీడీఆర్)లో తన ఫోన్ నంబర్ కూడా ఉండటంతో కేసు విచారణలో భాగంగా మీ వాంగ్మూలం అవసరం ఉందని నోటీసులో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు శుక్రవారం రాధాకృష్ణ విచారణకు హజరుకానున్నారు. ఇదే విధంగా చేవెళ్ల ఎంపీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని, విచారణకు రావాలని ఆయనకు కూడా సిట్ నుంచి పిలుపు అందినట్లు సమాచారం. 2023 నవంబర్ నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ నెంబర్‌ను ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది.
రివ్యూ కమిటీ లేఖలతోనే చిక్కిన ముఠా..
నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దలు చెప్పారంటూ వారు, వీరు అనే తేడా లేకుండా సొంత పార్టీ నేతలు మొదలు ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్‌ఐబీ బృందం అతి తెలివితో అసలైన ఆధారాలను వదిలివేసి సిట్‌కు చిక్కింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అనధికారికంగా కొండంత చేయగా, అధికారికంగా చేసిన ట్యాపింగ్‌లోనే నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు దొరికి పోయారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.
మావోయిస్టుల సమాచారం కోసమంటూ ప్రముఖుల ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి పంపిన ప్రభాకర్‌రావు తెలిసే నేరానికి పాల్పడ్డారని, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. 2023 నవంబర్ నెలకు సంబంధించి 615 మంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందిన విషయాన్ని న్యాయస్ధానంలో రుజువు చేయడం కోసమే సిట్ అధికారులు ఆయా బాధితుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ప్రభాకర్‌రావు బృందం తమ టార్గెట్ అయిన వారి ఫోన్ నెంబర్లకు వచ్చిన కాల్స్ వినడమే కాకుండా ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డు(ఐపీడీఆర్)ను కూడా ఉపయోగించారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక టూల్స్ ద్వారా వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్స్ ప్రభాకర్‌రావు ముఠా తెలుసుకుందని, వాటి ఆధారంగా పలు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులొచ్చాయి. మావోయిస్టుల పేరుతో అనుమతులు తీసుకుని ట్యాపింగ్ చేసినదే కాకుండా ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రైవేట్ వార్ రూమ్స్‌లో పెట్టి సిగ్నల్, ఫేస్‌బుక్ కాల్స్‌ను సైతం ప్రభాకర్‌రావు ముఠా విన్నారని ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అయితే, ప్రభాకర్ రావు ముఠా పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి విన్న, రికార్డు చేసిన సంభాషణల డేటాను పూర్తిగా ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News