Share News

Sigachi Industry: కడసారి చూపూ దక్కని ఘోరం!

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:34 AM

సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.

Sigachi Industry: కడసారి చూపూ దక్కని  ఘోరం!

  • మూడు రోజులైనా ఆచూకీ లభించని పది మంది

  • మంటలకు కాలి బూడిదైనట్లు అంచనా.. ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో మరో 20 మృతదేహాలు

  • డీఎన్‌ఏ విశ్లేషణలో జాప్యం.. మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల పడిగాపులు. ప్రాణాపాయ స్థితిలో ఆరుగురు

  • వర్షంతో సహాయ చర్యలకు ఆటంకం.. ఘటనపై నిపుణుల కమిటీ.. నెల రోజుల్లో నివేదికకు ఆదేశం

సంగారెడ్డి ప్రతినిధి/రామచంద్రాపురం టౌన్‌/పటాన్‌చెరు రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది. ప్లాంటులోని డ్రయర్‌కు సమీపంలో పనిచేస్తున్న ఆ పది మంది మంటల ఉధృతితోపాటు రసాయనాల ప్రభావంతో ఎముకలు సైతం బూడిదైపోయి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారిన మరో 20 మందికిపైగా మృతదేహాల గుర్తింపులోనూ జాప్యం జరుగుతోంది. ప్రమాదం జరిగి మూడు రోజులైనా తమవారి జాడ లేక.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆచూకీ చెప్పాలంటూ బుధవారం పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. మృతులు, గల్లంతైన వారి విషయంలో ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులు ఒక్కో లెక్క చెబుతుండటం గందరగోళానికి దారితీస్తోంది.

ప్రత్యేకంగా గాలింపు చేపట్టినా..

ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం బుధవారం ఘటనా స్థలిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు.. శిథిలాల్లో గాలించాయి. అదనపు వాహనాలను, పరికరాలను తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను టిప్పర్లతో ఖాళీ ప్రదేశాలకు తరలించి, మృతదేహాల అవశేషాల కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. బుధవారం ఒకరి చెయ్యి బయటపడగా మార్చురీకి తరలించారు. మంగళవారం రాత్రి నుంచీ కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.


మరణాలపై తికమక..

మంగళవారం ఉదయం మృతుల సంఖ్య 36కు చేరిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. 46 మంది వరకు చనిపోయినట్టు అధికారుల ద్వారా తెలిసిందని చెప్పారు. బుధవారం ఉదయం సిగాచి పరిశ్రమ యాజమాన్యం 40 మంది మృతిచెందారని ప్రకటించింది. రాత్రి సంగారెడ్డి కలెక్టర్‌ విడుదల చేసిన ప్రకటనలో మృతుల సంఖ్య 38 అని ఉంది. మరోవైపు పోస్టుమార్టం గదికి 45కు పైగా మృతదేహాల నమూనాలు వచ్చినట్టు చర్చ జరుగుతోంది. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉందని, అందులోనూ ఆరుగురు వెంటిలేటర్లపై ఉన్నారని సమాచారం. మరో ఆరుగురి శరీరాలు 70శాతానికి పైగా కాలిపోయాయని, వారిని మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్‌ ఆస్పత్రులకు తరలించాలని వారి బంధువులు కోరుతున్నారు.

24.jpg

అధికారుల నిర్లక్ష్యం.. వేటుకు రంగం సిద్ధం!

సిగాచి పరిశ్రమ నిర్వహణ తీరు, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కర్మాగారశాఖ, బాయిలర్స్‌ విభాగం, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. బాధ్యులపై వేటు వేయడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కాగా, సిగాచి దుర్ఘటనలో మృతిచెందిన తమ రాష్ట్ర కార్మికులు, క్షతగాత్రుల కోసం ఒడిశా అధికారుల బృందం బుధవారం పాశమైలారం చేరుకుంది.


ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీ

సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనపై అధ్యయనం కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో భారత రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ)కి చెందిన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన విభాగం (సీఎ్‌సఐఆర్‌) శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావు చైర్మన్‌గా, సభ్యులుగా టి.ప్రతా్‌పకుమార్‌, సూర్యనారాయణ, సంతోష్‌ గుజే ఉన్నారు. పరిశ్రమలో ప్రమాదానికి కారణాలు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? లోపాలు ఏమైనా ఉన్నాయా? యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అన్న అంశాలను పరిశీలించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని సూచించింది. మరోవైపు ఈ దుర్ఘటనపై సీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. ఈ కమిటీ గురు, శుక్రవారాల్లో విచారణ చేపట్టనుందని అధికారులు తెలిపారు. సిగాచి పరిశ్రమలో 40 మందికిపైగా మృతి చెందడం, చాలా మంది గాయపడిన నేపథ్యంలో 30కిపైగా అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆ వాహనాల్లో స్వస్థలాలకు తరలిస్తున్నారు. మూడు రోజులుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఇంత దారుణ ప్రమాదాన్ని మొదటిసారిగా చూశామని అంబులెన్సుల డ్రైవర్లు చెప్పారు.


వైస్‌ ప్రెసిడెంట్‌, డీజీఎం మృతదేహాల గుర్తింపు

పేలుడులో దుర్మరణం పాలైన సిగాచి పరిశ్రమ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇలంగోవన్‌, డీజీఎం ప్రవీణ్‌కుమార్‌ల మృతదేహాలను డీఎన్‌ఏ విశ్లేషణ ఆధారంగా బుధవారం గుర్తించారు. ఇలంగోవన్‌ మృతదేహాన్ని ఆయన సోదరుడు సుందరానికి అప్పగించి, చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఏపీలోని వైజాగ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెండేళ్లుగా సిగాచి పరిశ్రమలో డీజీఎంగా పనిచేస్తూ.. కుటుంబంతో కలసి అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచీ ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. డీఎన్‌ఏ విశ్లేషణలో బుధవారం ప్రవీణ్‌ మృతదేహాన్ని గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

డీఎన్‌ఏ నివేదికల కోసం ఎదురుచూస్తూ..

కాలిపోయిన మృతదేహాల డీఎన్‌ఏ విశ్లేషణ నివేదికల కోసం వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. డీఎన్‌ఏ శాంపిళ్లు సరిపోలిన వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ నగదు సాయం అందజేసి, మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక ఇక్కడే అంత్యక్రియలు చేపడతామన్న వారికి జీహెచ్‌ఎంసీ ఆయా స్మశాన వాటికల్లో ఏర్పాట్లు చేస్తోంది. అయితే డీఎన్‌ఏ విశ్లేషణ నివేదికలు అందడంలో జాప్యంతో మృతుల కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా పోయింది.

24.jpg


ఒక్కగానొక్క కొడుకు కనిపించడం లేదంటూ..

తమ ఒక్కగానొక్క కొడుకు ఫ్యాక్టరీలో పనికోసం వచ్చి ఆచూకీ లేకుండా పోయాడంటూ శివ్‌జీ అనే కార్మికుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఫ్యాక్టరీ వద్ద, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో చూస్తూనే ఉన్నామని, ఎక్కడా జాడ లేదని చెబుతున్నారు. శిథిలాలు తొలగిస్తే కడసారి తమ కొడుకును చూసుకుంటామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. శివ్‌జీకి భార్య, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు.

నా పిల్లలకు ఏం చెప్పాలి?

‘‘అమ్మా నాన్నెప్పుడు వస్తాడు, డ్యూటీ నుంచి ఇంకా రాలేదంటి అని పిల్లలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు..’’ అని ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుడు ప్రశాంత్‌ మహాపాత్ర భార్య సోనాలి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆస్పత్రుల్లో చూశామని, డీఎన్‌ఏ పరీక్షల కోసం నమూనాలు ఇచ్చామని చెప్పారు. పొట్టచేత పట్టుకుని ఒడిశా నుంచి వలస వచ్చామని, నా భర్త లేకుండా పిల్లలతో భవిష్యత్తును ఊహించుకుంటేనే భయం వేస్తోందంటూ ఆమె కన్నీరుమున్నీరు అవుతున్నారు.


స్టోర్‌లో ఉండడంతోనే బతికిపోయాం: యశ్వంత్‌కుమార్‌, ఏపీ

రియాక్టర్లు ఉన్న ప్యాక్టరీలోనే స్టోర్‌ విభాగం ఉందని, అక్కడి నుంచి కంపెనీలోకి వెళ్లేముందే ఆగ్నిప్రమాదం జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీకి చెందిన యశ్వంత్‌కుమార్‌ తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే బిల్డింగ్‌లోని మొదటి అంతస్తు ప్రహరీ నుంచి కింది దూకామని చెప్పారు. తాము స్టోర్‌ విభాగంలో ఉండడం, సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్లే బతికి బయటపడ్డామని పేర్కొన్నారు. గత పదేళ్లుగా సంస్థలో పనిచేస్తున్నానని, ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం జరుగలేదని మరో క్షతగాత్రుడు సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఆ రోజు పెద్ద శబ్దం వచ్చిందని, మంటలు రావడంతో అందరం అరుచుకుంటూ పరుగు పెట్టామని వివరించారు.


ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:37 AM