Shravan Rao Dubai flat: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు.. శ్రవణ్‌రావు ఫ్లాట్‌లోనే!
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:26 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు ఫ్లాట్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి‘ రాసిన కథనం అక్షర సత్యమైంది.

చాణక్య బూనేటితోపాటు మరో నలుగురూ అక్కడే
వాళ్లకు ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు.. శ్రవణ్‌రావే
కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు
ఎవరెవరు ఉన్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్‌లో నమోదు
ఖరీదైన ఫ్లాట్ వ్యవహారంలో శ్రవణ్‌రావు అరాచకం
సహ యజమాని ఆకర్ష్‌కు అద్దెలో వాటా చెల్లించని వైనం
ఈ నెల 22న విచారణకు రావాలని ఆకర్ష్‌కు ఏపీ సిట్ నోటీసు
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు ఫ్లాట్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి‘ రాసిన కథనం అక్షర సత్యమైంది. దుబాయ్‌లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్‌రావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోనే లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్టు తేలింది. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య బూనేటి, మరో నలుగురు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆ ఫ్లాట్‌లోనే ఉన్నారని వెల్లడైంది. ఆ ఫ్లాట్‌ను డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకిచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణ్‌రావు తరపున ఐన్యూస్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది. యజమాని కోటా కింద శ్రవణ్‌రావే కొంతకాలం తీసుకుని, లిక్కర్ స్కామ్ నిందితులకు ఇచ్చారని.. స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలూ లభించాయి.
సెక్యూరిటీ రిజిస్టర్‌లో వివరాలతో..
దుబాయ్‌లోని పారామౌంట్ టవర్ హోటల్స్ అండ్ రెసిడెన్సె్‌సలో 35వ అంతస్తు వరకు హోటల్ ఉండగా ఆపై అంతస్తుల్లో నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 5801 నంబర్ ఫ్లాట్ శ్రవణ్‌రావుకు సంబంధించింది. దీనిని రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలో ఒక నెల పాటు యజమాని ఆ ఫ్లాట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు రెండు నెలల పాటు ఫ్లాట్‌ను ఉపయోగించుకున్న శ్రవణ్‌రావు ఒక నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించినట్టు తేలింది. టవర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. యజమానులు సహా ఎవరు ఫ్లాట్‌లోకి వెళ్లాలన్నా ఆధారపూర్వక వివరాలు ఇవ్వాల్సిందే. ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు శ్రవణ్‌రావు, చాణక్య, మరో నలుగురు ఫ్లాట్‌లోనే ఉన్నారని తేలినట్టు సమాచారం. శ్రవణ్‌రావు అక్కడున్న కాలంలో నిక్కరు (షార్ట్) వేసుకుని చక్కర్లు కొట్టారని, సీసీ కెమెరా ఫుటేజీలో ఆయనను శ్రవణ్‌రావుగా సెక్యూరిటీ సిబ్బంది ధ్రువీకరించినట్టు తెలిసింది. లిక్కర్ స్కామ్ కీలక నిందితులు ఉండటంతో ఈ అంశంపై ఏపీ సిట్ మరింత దృష్టిపెట్టింది. నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తే మరిన్ని వివరాలు బయటికి వస్తాయని భావిస్తోంది.
ఫ్లాట్ భాగస్వామిని ఇబ్బందిపెట్టిన శ్రవణ్
వాస్తవానికి శ్రవణ్‌రావు ఆ ఫ్లాట్‌కు పూర్తి యజమాని కాదు. భాగస్వామి ఉన్నారు. ఆ భాగస్వామిని కూడా శ్రవణ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందిపెట్టినట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఆకర్ష్ కృష్ణ దుబాయ్‌లో పెట్టుబడి కింద ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించారు. ఆకర్ష్‌తో పరిచయమున్న శ్రవణ్‌రావు ఫ్లాట్ కొనుగోలులో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో ఆకర్ష్, శ్రవణ్‌రావు కలిసి 2 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.4.7 కోట్లు) పెట్టి 2023 ఫిబ్రవరి 15న ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఆకర్ష్ భార్య కావ్య, శ్రవణ్‌రావు భార్య స్వాతి పేరిట చెరో సగం సమాన వాటాతో రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత శ్రవణ్‌రావు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని.. అది ఉమ్మడి ఆస్తి అయినా కూడా భాగస్వామికి తెలియకుండా ఫ్లాట్‌ను డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. కనీసం అద్దెలో వాటాను కూడా ఆకర్ష్, ఆయన భార్యకు ఇవ్వలేదు. వారు ఫోన్ చేసినా శ్రవణ్‌రావు, స్వాతిరావు స్పందించలేదు. దీనితో ఆకర్ష్, కావ్య కలిసి స్వాతిరావుకు ఈ-మెయిల్ చేశారు. తమకు అద్దె వాటా చెల్లించాలని, లేదంటే ఫ్లాట్ అమ్మేసి ఎవరి వాటా వారు తీసుకుందామని కోరారు. అయినా స్పందన రాకపోవడంతో డీలక్స్ హాలిడే హోమ్స్ ప్రతినిధులను కలిసి.. ఫ్లాట్ పత్రాలను చూపారు, అద్దెలో తమకు రావాల్సిన వాటా గురించి చర్చించారు.
ఆకర్ష్ కృష్ణకు ఏపీ సిట్ నోటీ్‌సలు
ఏపీ లిక్కర్ స్కామ్‌తో దుబాయ్ ఫ్లాట్‌కు లింకులు ఉన్న నేపథ్యంలో.. ఫ్లాట్ భాగస్వామిగా ఉన్న ఆకర్ష్ కృష్ణ, ఆయన భార్య కావ్యకు ఏపీ సిట్ అధికారులు గురువారం నోటీసులు ఇచ్చారు. 22న విచారణకు హాజరై సమాచారం అందించాలని కోరారు. దుబాయ్ ఫ్లాట్ విషయంలో శ్రవణ్‌రావు నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆకర్ష్.. సిట్ విచారణలో వివరాలు వెల్లడించడంతోపాటు తమ వద్ద ఉన్న ఆధారాల్ని అందించనున్నారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి