Share News

Revanth Reddy: రూ.12,062 కోట్లు 30,500 ఉద్యోగాలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:03 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ పర్యటన ఫలవంతంగా ముగిసింది. రూ.12,062 కోట్ల పెట్టుబడులు, 30,500 ఉద్యోగాలు సాధించడమేకాకుండా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి

Revanth Reddy: రూ.12,062 కోట్లు 30,500 ఉద్యోగాలు

సీఎం జపాన్‌ పర్యటనతో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు

  • రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ఒప్పందాలు ముగిసిన రేవంత్‌ జపాన్‌ పర్యటన... నేడు తిరిగిరాక

  • చివరి రోజు హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం

  • మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి.. ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ప్రసంగం

గర్వించే భవిష్యత్తును రూపొందిస్తాం

  • రాహుల్‌ లేఖకు ఎక్స్‌ వేదికగా రేవంత్‌ స్పందన

  • రోహిత్‌ వేముల చట్టం రూపకల్పనకు సంకేతం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారంరోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. ఈ మేరకు జపాన్‌కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీల రాకతో పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌ పర్యటన మంగళవారంతో ముగిసింది.


ఈ నెల 16న తెలంగాణ రైజింగ్‌ బృందంతో కలిసి ముఖ్యమంత్రి జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన రాష్ట్రానికి రానున్నారు. చివరి రోజైన మంగళవారం హిరోషిమాలో రేవంత్‌ బృందం పర్యటించింది. హిరోషిమా శాసన సభ్యుల బృందం రేవంత్‌రెడ్డిని గాంధీ మెమోరియల్‌, హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ పార్క్‌, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్‌ నివాళి అర్పించారు. శాంతి స్మృతి వనం వద్ద అణుబాంబు ఘటనలో మృతిచెందిన వారికి పుష్పాంజలి ఘటించారు. 1945లో హిరోషిమాపై జరిగిన దాడి నాటి భవన శిథిలం ‘ఆటమిక్‌ బాంబ్‌ డోమ్‌’ను కూడా రేవంత్‌ సందర్శించారు. అనంతరం హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌ మికాయొకాటాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై చర్చలు జరిపారు. వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్‌ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్‌, మురుగు నీటి శుద్థి, పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు, అర్బన్‌ ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజినీరింగ్‌, స్మార్ట్‌ సిటీ సొల్యూషన్స్‌, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్‌ అండ్‌ మొబిలిటీ కారిడార్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలసై చర్చించారు.


విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్‌ పార్క్‌, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్థ వారసత్వానికి సహకరించాలని కోరారు.

హిరోషిమాకు రావడం గౌరవంగా ఉంది

హిరోషిమా రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీని రేవంత్‌ బృందం సందర్శించింది. స్పీకర్‌ తకాషి నకమోటో సాదరస్వాగతం పలికారు. శాసనసభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘హిరోషిమా అంటే ఆశ. ప్రజలు కలిసికట్టుగా పనిచేేస్త ఏదైనా సాధ్యమని ప్రపంచానికి నిరూపించిన నగరం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. దూరదృష్టితో విజయం సాధించిన రాష్ట్రం’’ అని చెప్పారు. పరస్పర సహకారం, భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి వచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ సందర్శనకు రావాలని అక్కడి అధికారులను, పారిశ్రామికవేత్తలను కోరారు. హిరోషిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు.


జయ జయహే తెలంగాణ

గాంధీ మెమోరియల్‌ దగ్గర సీఎంకు స్థానికంగా చదువుతున్న హాసిని, హరిణి పాటలతో స్వాగతం పలికారు. రేవంత్‌ అభివాదం చేస్తున్న ఫొటోను ఆర్ట్‌గా గీసి బహుమతిగా అందించారు. గాంఽధీ విగ్రహం దగ్గర.. ‘‘జయ జయహే తెలంగాణ’’ అంటూ రాష్ట్ర గేయాన్ని పాడి వినిపించారు. ఫొటోలను రేవంత్‌ చూసి మురిసిపోయారు. ఆ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు.

పెట్టుబడుల వివరాలు

  • మారుబెని కంపెనీ: హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీలో నెక్ట్స్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ఒప్పందం. రూ.1000 కోట్లతో ప్రారంభ పెట్టుబడి, రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెరిగే అంచనా. దాదాపు 30 వేల ఉద్యోగాల కల్పన అంచనా.

  • ఎన్‌టీటీ డేటా, నెయిసా: ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఒప్పందం. రూ.10,500 కోట్ల మేర పెట్టుబడులతో ఒప్పందం.

  • తోషిబా ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా(టీటీడీఐ) రుద్రారంలో విద్యుత్‌ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు. రూ.562 కోట్ల పెట్టుబడులు.

  • కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్‌ మాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్‌కామ్‌)... జపాన్‌లోని టీజీయూకే టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(టెర్న్‌), రాజ్‌ గ్రూపులతో ఒప్పందం. రెండింటి ద్వారా 500 మంది తెలంగాణవారికి ఉద్యోగాల కల్పనకు ఒప్పందం.


మీ భావాల స్ఫూర్తితో గర్వించే భవిష్యత్తును రూపొందిస్తాం

రాహుల్‌ లేఖకు రేవంత్‌ స్పందన

రోహిత్‌ వేముల చట్టం రూపకల్పన సంకేతం

రాష్ట్రంలో రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా బదులిచ్చారు. జపాన్‌లోని చారిత్రక నగరమైన హిరోషిమాలో.. మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి ముందు లేఖ చదివానని, ఆ లేఖలో రాహుల్‌గాంధీ స్ఫూర్తిదాయక మాటలు తనను కదిలించాయని పేర్కొన్నారు. తాము గర్వించదగిన భవిష్యత్తును రూపొందించేందుకు రాహుల్‌గాంధీ ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.


ఇవి కూడా చదవండి

Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..

Lady Aghori: లేడీ అఘోరీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Updated Date - Apr 23 , 2025 | 08:37 AM