Share News

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:38 AM

విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

  • మీరనుకుంటున్నట్లు సౌమ్యుణ్ని కాను.. విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్లొచ్చా

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్‌

  • పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపు

  • కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదు: కిషన్‌రెడ్డి

  • రాంచందర్‌రావు మిస్సైల్‌.. ఆయన చరిత్ర వింటే కన్నీళ్లొస్తాయ్‌: బండి సంజయ్‌

  • అందరి ఆమోదంతో రాంచందర్‌రావు ఎన్నిక: ఎంపీ ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, జూలై1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. దూకుడంటే చొక్కా గుండీలు విప్పడం కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడమని చెప్పారు. ‘‘మీరు అనుకుంటున్నట్లు నేను సౌమ్యుణ్ని కాను. ఉస్మానియా క్యాంప్‌సలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్లొచ్చా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా. జితేందర్‌రెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను అరెస్టు చేయాలని నాడు అసెంబ్లీ ముందు ధర్నా చేశా. అప్పుడే లాఠీచార్జిలో నా చెయ్యి విరిగింది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చెయ్యడం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలి’’ అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు రాంచందర్‌రావు సవాలు విసిరారు. ఆ పార్టీల నేతలకు దమ్ము లేదు కాబట్టే పేరు లేని పేపర్లు పెట్టి, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తప్పుడు వార్తల ప్రచారం కోసం సోషల్‌ మీడియా యూనివర్సిటీలే పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. మంగళవారం మన్నెగూడలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రాంచందర్‌రావుకు నియామక పత్రం అందజేశారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం పార్టీ అధ్యక్షుడి హోదాలో రాంచందర్‌రావు తొలి ప్రసంగం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్య, వికసిత తెలంగాణ సాధ్యమని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని పెంచుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో అందరితో చర్చించి తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తామని చెప్పారు. నాడు నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడడం వల్లే నేడు ఓయూ, కేయూలు ఏబీవీపీకి అడ్డాలుగా ఉన్నాయని తెలిపారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేయాలంటే ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.


కార్యకర్తలే అధ్యక్షులు..

పేరుకే తాను అధ్యక్షుడినైనా అసలు అధ్యక్షులు కార్యకర్తలేనని రాంచందర్‌రావు చెప్పారు. ‘నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం ప్రతి కార్యకర్తకు గర్వకారణం. కార్యకర్తలే బీజేపీకి నిజమైన సారథులు’ అని అన్నారు. ‘క్రమశిక్షణ, సిద్ధాంతాల పట్ల నిబద్ధతతోనే ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మనందరి లక్ష్యం.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే’ అని రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను యువమోర్చా కార్యకర్తగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో సభ్యత్వ నమోదు కోసం సైకిల్‌పై వెళ్లేవాళ్లమని, పార్టీ కోసం కష్టపడి పనిచేశామని చెప్పారు. బీజేపీ అనేది శ్రేణులు, ప్రజలు, సిద్ధాంతం ఆధారంగా పనిచేసే పార్టీ అని తెలిపారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా ఉండదన్నారు. అందరూ కలిసి బీజేపీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

పోటీపడి దోచుకుంటున్నారు: కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోటీపడి దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందంటూ ప్రతి అడ్డమైనోడు మాట్లాడుతున్నాడని పరోక్షంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. కొంతమంది సన్నాసులు చేసే ఆరోపణలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు సవాల్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబం, రాహుల్‌ కుటుంబం, సీఎం రేవంత్‌ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని కిషన్‌రెడ్డి అన్నారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడుదొంగలు: లక్ష్మణ్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు తోడుదొంగలని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. బనకచర్లపై లేని సమస్యను సృష్టించాయని ఆరోపించారు. తెలంగాణ వాదం పేరిట బీజేపీపై బీఆర్‌ఎస్‌ బురద జల్లే ప్రయత్నం చేసిందని విమర్శించారు. బనకచర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేయడంతో వాస్తవాలు ప్రజలకు తెలిశాయన్నారు. రాంచందర్‌రావుకు పార్టీ అధ్యక్ష పదవి దక్కడం ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావించాలని లక్ష్మణ్‌ చెప్పారు. రాంచందర్‌రావు బీజేపీలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న నిజమైన కార్యకర్త అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం కష్టపడిన నాయకులకే బీజేపీలో పెద్ద పదవులు లభిస్తాయని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్‌రావు ఒక మిస్సైల్‌ లాంటి వాడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాంచందర్‌రావు ఏం చేశారని ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా చేశారంటూ కొన్ని పార్టీలు అంటున్నాయని.. ఆయన ఓ మిస్సైల్‌ అని, ఆయన చరిత్ర వింటే కళ్ల వెంట నీళ్లొస్తాయని చెప్పారు. ‘ఎందుకు కుంటుకుంటూ నడుస్తరు? చెయ్యి ఎందుకు వంకర ఉంటుంది? అంటూ నేనోసారి రాంచందర్‌రావును అడిగా. ఓయూలో ఏబీవీపీలో ఉన్నప్పుడు ఆర్‌ఎ్‌సయూ, పీడీఎ్‌సయూ వాళ్లు దాడి చేసి నా కాళ్లు, చేతులు విరగ్గొట్టారని, అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అవస్థ పడుతున్నానని ఆయన చెబితే నా కళ్ల వెంట నీళ్లొచ్చినయి’ అని సంజయ్‌ తెలిపారు. పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జెండా కోసం కష్టపడిన గొప్ప నేత అని ప్రశంసించారు. దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. ఆ దమ్ము కాంగ్రె్‌సకు ఉందా? బీఆర్‌ఎ్‌సకు ఉందా? మీరు అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా? అని నిలదీశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేద్దామని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. అందరి ఆమోదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో చాలా రోజుల నుంచి తనకు మంచి స్నేహం ఉందన్నారు. సౌమ్యుడు, చిత్తశుద్ధి ఉన్న కార్యకర్త అని ప్రశంసించారు. రాంచందర్‌రావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీ అగ్రనాయకత్వం మంచి సందేశం ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.


రఘునందన్‌కు రాంచందర్‌రావు పరామర్శ

సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పరామర్శించారు. మంగళవారం రఘునందన్‌తో కాసేపు మాట్లాడి.. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


బీజేపీ సభకు అర్వింద్‌ డుమ్మా!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ హాజరవకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అర్వింద్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఒకదశలో ఆయన పేరును కూడా పార్టీ అధినాయకత్వం పరిశీలించిందన్న ప్రచారమూ జరిగింది. కానీ, అనూహ్యంగా రాంచందర్‌రావు పేరును ఖరారు చేశారు. రాంచందర్‌రావు నామినేషన్‌ దాఖలు సందర్భంలో కూడా అర్వింద్‌ అందుబాటులో లేరు. అయితే, తాను వ్యక్తిగత కారణాలతోనే కార్యక్రమానికి హాజరు కాలేదని అర్వింద్‌ చేసిన ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మరోవైపు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, సీనియర్‌ నేత చింతల రాంచంద్రారెడ్డి వంటి వారు కూడా హాజరుకాకపోవడంపై పార్టీ నేతల్లో చర్చ జరిగింది. నియోజకవర్గంలో ముందుగా ఖరారు చేసుకున్న కార్యక్రమాల వల్లే వెంకటరమణారెడ్డి హాజరు కాలేకపోయి ఉంటారని పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.

25 మంది కార్యవర్గసభ్యుల ఎన్నిక

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా 25 మందిని ఎన్నుకున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొందరు సీనియర్‌ నాయకులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం

వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..

For More Telangana News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 05:47 AM