Family Crisis: ఆలోచించండి... ఓ అమ్మానాన్న? పిల్లలేం చేశారు పాపం!
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:35 AM
తన కూనల జోలికి వచ్చినవారిపై పిల్లులు, కుక్కలు తీవ్రంగా దాడి చేస్తాయి! తల్లి కోడి సైతం తన పిల్లలున్న గంప దగ్గరికి ఎవ్వరినీ రానివ్వదు!! పశుపక్ష్యాదులు ఇలా తమ ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డలను కాపాడుకుంటాయి.

కన్నబిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు
తాము చనిపోతే వాళ్లేమవుతారోనని భయం
కన్నవారి మానసిక రుగ్మతలే చిన్నారులకు శాపమవుతున్న వైనం
సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చు: మానసిక వైద్యులు
(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి): తన కూనల జోలికి వచ్చినవారిపై పిల్లులు, కుక్కలు తీవ్రంగా దాడి చేస్తాయి! తల్లి కోడి సైతం తన పిల్లలున్న గంప దగ్గరికి ఎవ్వరినీ రానివ్వదు!! పశుపక్ష్యాదులు ఇలా తమ ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డలను కాపాడుకుంటాయి. కానీ.. ఆలోచించే శక్తి, తెలివితేటలు ఉన్న మనుషులు మాత్రం తమ కడుపున పుట్టిన బిడ్డల్ని చంపి తాము ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవలికాలంలో పెరుగుతున్నాయి! ‘‘మా ఆయుష్షుకూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు’’ అంటూ దీవించిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ఉసురు తీస్తుండడం బాధాకరం. సాధారణంగా పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది.. కన్నబిడ్డల గొంతు నులిమి, వారికి విషం పెట్టి చంపేసేంత కర్కశత్వం వారిలో ఎందుకొస్తోంది? ఎలా వస్తోంది? అంటే.. రకరకాల మానసిక రుగ్మతలు, తాము చనిపోతే బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళనే ఇందుకు కారణమని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ హబ్సిగూడలో తమ ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి దంపతులే ఇందుకు ఉదాహరణ. ప్రైవేటు కళాశాల మాజీ లెక్చరర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తనతోపాటే ప్రాణాలు తీసుకోవాలని భార్యకూ చెప్పి ఒప్పించాడు. తాము చనిపోతే పిల్లలేమైపోతారోనన్న ఆందోళనతో.. వారిద్దరూ ఉరి వేసుకోవడానికి ముందు.. తమ 15 ఏళ్ల కుమార్తెను, పదేళ్ల కుమారుణ్ని కర్కశంగా చంపేశారు. మొన్నటికిమొన్న విజయవాడలో శ్రీనివాస్ అనే వైద్యుడు అప్పుల బాధ తట్టుకోలేక తల్లి, భార్యతో సహా తమ ఇద్దరు పిల్లల్నీ పొట్టనపెట్టుకొని, ఆపై తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. వ్యవసాయంలో వరుస నష్టాలతో.. కడపజిల్లాకు చెందిన నాగేంద్ర తాను ఉరివేసుకుని చనిపోవడానికి ముందు భార్యా, పిల్లలను చంపేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఊబిలోచిక్కుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకటేశ్.. కన్నబిడ్డలన్న కనికరమైనా లేకుండా.. ఐదేళ్లలోపు బాబు, పాప ముఖంపై దిండుపెట్టి అదిమి, ఆపై భార్యను కడతేర్చి తాను తనువు చాలించాడు. ఇలా ఇటీవలికాలంలో పలు ఘటనలు జరగడం పౌర సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
భయమే కారణమా!
సాధారణంగా ఇలాంటి దారుణాలు ఇంటిపెద్ద ప్రేరణతోనే జరుగుతాయని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ పింగళి లక్ష్మి తెలిపారు. తాను లేకపోతే భార్యాబిడ్డలు బతకలేరేమోనన్న ఆందోళన.. వారి జీవితాలు చిన్నాభిన్నమవుతాయేమోనన్న భయంతోనే ముందుగా ఇంటి పెద్ద భాగస్వామిని ఆత్మహత్యకు ఒప్పించి, ఆపై పిల్లలను చంపి తమ ఉసురుతీసుకుంటున్నారని ఆమె వివరించారు. ఆర్థిక సమస్యలు, బెట్టింగ్‌లాంటి వ్యసనాలు, కుటుంబ కలహాలు వంటివి వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా పైకి కనిపించినా.. బలవంతంగా ఉసురు తీసుకునే స్వభావం వెనుక మానసిక రుగ్మతలు, వారి కుటుంబంలో అలాంటి చరిత్ర ఉండడం లాంటి అనేక కారణాలు ఉంటాయని తెలిపారు. అలాంటి ప్రవర్తన కలిగిన కుటుంబాలకు చెందినవారు.. బంధు, మిత్రులతో సాధారణంగా కలవరని ఆమె వెల్లడించారు. ముభావంగా ఉండడం, మరొకరిని సాయం అడగలేకపోవడం, ఆత్మన్యూనతా భావం వంటి లక్షణాలున్న వ్యక్తులు ఎక్కువగా బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు డాక్టర్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు.
ఐదేళ్లలోపువారే ఎక్కువ...
కన్నవారి చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువ ఉంటున్నారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసెన్ అధ్యయనంలో తేలింది. ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని ఆ నివేదికలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దుర్ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళనకరం. తల్లిదండ్రులు పిల్లలను తమ ఆస్తిగా భావిస్తుండడం వల్ల.. వారిపై సర్వాధికారాలూ తమకే ఉన్నాయన్న మానసిక స్థితి.. కడుపునపుట్టినవారిని చంపడానికి ఒక ప్రధాన కారణంగా పనిచేస్తుందని తరుణీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మమతా రఘువీర్ తెలిపారు. ఈ తరహా ఆలోచనలు, మానసిక రుగ్మతలు ఉన్నవారిని గుర్తించి, తగిన చికిత్స చేయిస్తే ఇలాంటి దారుణాలకు, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక అనారోగ్యమూ ఒక వ్యాధే
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మానసిక సమస్యలు పెరిగాయి. మలేరియా, టైఫాయిడ్ వంటివాటిలాగానే మానసిక అనారోగ్యం కూడా ఒక వ్యాధి. దానికి తగిన చికిత్స తీసుకోవాలన్న స్పృహ సమాజంలో పెరగాలి. అప్పుడే ఇలాంటి ఆత్మహత్యలు తగ్గుతాయి. కుటుంబ, ఆర్థిక సమస్యలు చాలామందికి ఉంటాయి. అలా ఉన్నవారంతా ఆత్మహత్యకు పాల్పడరు. వ్యసనాలకు గురైనవారంతా చనిపోవాలనుకోరు. స్వభావంలోనే సూసైడల్ టెండెన్సీ ఉన్నవారు, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు.. చనిపోవడమే తమ సమస్యలకు పరిష్కారంగా భావిస్తారు. అదే ఈ విషాద ఘటనలకు కారణం. ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే మానసిక వైద్యులను సంప్రదించడం ద్వారా వారి ప్రాణాలతోపాటు, వారి కుటుంబాలను కూడా కాపాడవచ్చు. అసలు పాఠశాల దశ నుంచే పిల్లల్లో ఇలాంటి లక్షణాలను గుర్తించి వాటికి అధిగమించడానికి తగిన పరిష్కారాలు చూపించాలి. ఆత్మహత్య ఆలోచనల నివారణకు మన దేశంలో చాలా హెల్ప్‌డె్‌స్కలు పనిచేస్తున్నాయి. కనీసం వాటినైనా సంప్రదించాలి.
- డాక్టర్ పింగళి శ్రీలక్ష్మి, సీనియర్ సైకియాట్రిస్ట్, రోష్ని కౌన్సెలింగ్ సెంటర్