Share News

Corruption: ‘ప్రైవేటు’గా వసూళ్లు!

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:23 AM

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందాలకు లంచాలిచ్చి, తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకున్నాయి.

Corruption: ‘ప్రైవేటు’గా  వసూళ్లు!

  • తనిఖీల మాటున ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి భారీగా దండుకుంటున్న ఉన్నతాధికారి

  • లోటుపాట్లే అవకాశంగా వసూళ్ల పర్వం

  • కాలేజీల్లో సీట్లను బట్టి సొమ్ములు డిమాండ్‌

  • ఓ మాజీ మంత్రి కాలేజీ నుంచి రూ.40 లక్షలు

  • ప్రైవేటు వైద్యకళాశాలల వ్యవహారాలు చూసే సంస్థ ఉన్నతాధికారి బాగోతం

  • ఆ సంస్థలోనూ ఇష్టానుసారంగా వ్యవహారం

  • వారానికి ఒక్కసారే విధులకు హాజరు

  • ఆయన కోసం ఏకంగా 3 ప్రభుత్వ వాహనాలు!

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందాలకు లంచాలిచ్చి, తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకున్నాయి. దీనిపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదైంది. తాజాగా ఇలాంటి బాగోతమే మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారాలు చూసుకునే ఓ సంస్థ ఉన్నతాధికారి.. తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని లోటుపాట్లనే అవకాశంగా చేసుకొని ఈ వసూళ్ల పర్వానికి తెర లేపినట్లు సమాచారం. అంతేకాదు ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏకకాలంలో మూడు ప్రభుత్వ వాహనాలను వాడుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో చాలా ఆస్పత్రుల్లో అఽధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. పడకలు, అలాగే రోగులూ ఉండరు. దీనికితోడు బోధనాస్పత్రుల్లో పనిచేసే ఇంటర్నీస్‌, పీజీలు, రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైపెండ్‌ చెల్లించవు. కొన్ని కాలేజీలు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. మరికొన్ని తూతూ మంత్రంగా ఇస్తున్నాయి. దీన్నే ఆ ఉన్నతాధికారి అస్త్రంగా వాడుకున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతో ఒకేసారి మాట్లాడాలని సదరు అధికారి భావించారు. అంతే వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌ను వేదికగా చేసుకున్నారు. అక్కడికి అన్ని ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాళ్లు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. పిలిచింది పెద్ద అధికారి కావడంతో కిక్కురుమనకుండా అందరూ వెళ్లారు. అక్కడే ఆయన తన ఉద్దేశాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనకు కావాల్సిందేంటో కూడా వారికి చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఈ సంస్థను పెద్దగా పట్టించుకోవు. కానీ, సీట్ల పెంపు వంటి విషయలో రాష్ట్ర ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌ ఇస్తుంది. దాని ఆధారంగా ఈ సంస్థ మెడికల్‌ కాలేజీలకు కన్సెంట్‌ ఆఫ్‌ ఎఫిలియేషన్‌ (సీవోఏ) ఇస్తుంది. ఈ రెండూ ఉంటేనే ఎన్‌ఎంసీ కొత్త కాలేజీల ఏర్పాటుకు, సీట్ల పెంపునకు, కొత్త సీట్ల దరఖాస్తుకు అనుమతి ఇస్తుంది. సరిగ్గా ఇక్కడే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు దొరికిపోయాయి. గతంలో తేలిగ్గా సీవోఏ, ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లను తెచ్చుకున్న కాలేజీల యాజమాన్యాల ఆటలు ఈ సారి సాగలేదు.


తనిఖీల మాటున వసూళ్ల పర్వం..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వైద్య కళాశాలల్లో లోపాలు, స్టైపెండ్‌పై వైద్యవిద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో స్టైపెండ్‌ విషయమై తనిఖీలు చేయమని సర్కారు ఆ సంస్థ అధికారులను ఆదేశించింది. దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ ఉన్నతాధికారి.. తనిఖీల మాటున వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు చెబుతున్నారు. ఓ మాజీ మంత్రికి చెందిన వైద్య కళాశాల నుంచి తనిఖీల సమయంలో రూ.40 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సదరు కాలేజీలో పనిచేస్తున్న వైద్య అధ్యాపకులు సైతం ధ్రువీకరించారు. అలా తనిఖీలకు పంపి, ఇలా వసూళ్లకు తెగబడినట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల కాలేజీలు మినహా మిగిలిన వారి కళాశాలల నుంచి వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కాలేజీలో ఉండే సీట్ల సంఖ్య ఆధారంగా వసూళ్లు చేసినట్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రైవేటు కాలేజీలకు తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రొఫెసర్‌ స్థాయి వారిని పంపుతారు. అయితే కొన్నిచోట్ల తనిఖీల్లో ఆ ఉన్నతాధికారి సైతం పాల్గొన్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి.


ఆయన కోసం మూడు వాహనాలు!

ఆ సంస్థలోని ఉన్నతాధికారులకు నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ వాహనాన్ని మాత్రమే వాడుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ, ఆ అధికారి మాత్రం మూడు వాహనాలను వాడేస్తున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆయన కోసం ఒకటి, కుటుంబ సభ్యుల కోసం రెండు వాడుతున్నట్లు తెలిపాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరిని రోజూ ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు తీసుకెళ్లి, తీసుకురావడం కోసం ఒక వాహనాన్ని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఒక్క వాహనానికి ఇంధనం కోసమే నెలకు రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. మూడు వాహనాలు వాడుకుంటున్న ఆ అధికారి ఆఫీసుకు వచ్చేది మాత్రం వారానికి ఒక్కసారేనని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు కార్యాలయంలో ఆఫీసు ఖర్చుల కోసం ఉండే నగదు నిల్వలను సైతం తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి తీరుతో అక్కడ పనిచేసే మరో ఉన్నతాఽధికారి ఏకంగా నెలకుపైగా సెలవు పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు అఽధికారులు కూడా కార్యాలయంలో జరిగే అవకతవకలు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనన్న భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. సంస్థలో జరుగుతున్న అవకతవకలు, ఉన్నతాధికారి వసూళ్లపై విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 03:23 AM