Share News

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:32 AM

సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

  • ఫీజు రాబట్టుకోవడానికి ప్రైవేటు కాలేజీ నిర్వాకం

శివ్వంపేట/నర్సాపూర్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం టీక్యా తండాకు చెందిన లునావత్‌ శ్రీరామ్‌నాయక్‌ గత ఏడాది నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేరాడు. ఈ సంవత్సరం అతడికి ఎప్‌సెట్‌లో ఇంజనీరింగ్‌ సీటు రావడంతో డిగ్రీ కాలేజీలో టీసీ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే, మొదటి సంవత్సరం చెల్లించాల్సిన ఫీజు రూ.ఆరు వేలు కడితేనే టీసీ ఇస్తామని కాలేజీ నిర్వాహకులు తెలిపారు. తన వద్ద రూ.2 వేలు మాత్రమే ఉన్నాయని విద్యార్థి చెప్పగా.. చెక్‌ ఇస్తే టీసీ ఇస్తామని కాలేజీ వారు చెప్పారు. తన వద్ద చెక్‌ లేదని, ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు టీసీ అవసరమని విద్యార్థి కాలేజీ నిర్వాహకులతో మొర పెట్టుకున్నాడు. వారు ఆ రూ.2 వేలు తీసుకుని మిగిలిన డబ్బులకు ప్రామిసరీ నోటు రాసివ్వాలని చెప్పడంతో చేసేదేమీ లేక నోటు రాసి ఇచ్చి టీసీ తీసుకున్నానని బాధిత విద్యార్థి వాపోయాడు.


ఇంజనీరింగ్‌లో 93 శాతం సీట్ల భర్తీ

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): టీజీఎ్‌పసెట్‌లో భాగంగా ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి సంబంధించిన మొదటి విడత జాబితాను శనివారం ప్రకటించారు. కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో మొత్తం 83,054 సీట్లు అందుబాటులో ఉండగా.. 77,154 సీట్లు కేటాయించారు. మొత్తం సీట్లలో ఇవి 92.89 శాతం. ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలో మొత్తం 195 సీట్లు ఉండగా 119 (61.03ు), 20 యూనివర్సిటీల కాలేజీల్లోని 6,108 సీట్లలో 5,163 (84.53ు), రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 1,367 సీట్లలో 1,357 (99.26ు), 149 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మొత్తం 75,384 సీట్లలో 70,515 (93.54ు) సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,900 సీట్లు మిగిలి ఉన్నాయి. మొదటి విడతలో 95,256 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిందని, 94,059 మంది ఆప్షన్లు ఇచ్చారని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:32 AM