Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:36 AM
పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.

అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల
మెయిల్.. అందులో 615 మంది ఫోన్ల వివరాలు
హార్డ్‌డిస్క్ ధ్వంసం చేసినా మెయిల్ సంగతి మరిచారు
మావోయిస్టుల సమాచారం కోసమంటూ
లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్‌రావు బృందం
జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు
అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండీ ఫోన్ ట్యాప్
సిట్ ముందు వాంగ్మూలమిచ్చిన సందర్భంగా
రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు
దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచనున్న సిట్
హైదరాబాద్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది. నిజానికి బీఆర్‌ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్నాడు రాత్రే ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేపట్టారు. హార్డ్ డిస్క్‌లను ముక్కలుగా చేసి మూసీలో పడేశారు. ఫోన్ రికార్డు చేయాల్సిన వారి కోసం తయారు చేసిన ప్రొఫైల్స్‌ను కాల్చి బూడిద చేశారు. ఒక్క ఆధారం దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారాలను అందించింది. కేవలం ఒక మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో 615 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు. ఫోన్ ట్యాపింగ్ కోసం అన్ని అనుమతులు పొందిన తర్వాత టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు(టీఎ్‌సపీ) ఎస్‌ఐబీ నుంచి లేఖలు వెళ్లేవి. ఎస్‌ఐబీ కోరిన ఫోన్ నంబర్ల సమాచారం అడిగిన వెంటనే సాధ్యమైనంత తొందరగా టీఎ్‌సపీలు అందచేసేవి. అన్ని టీఎ్‌సపీలతో ఎస్‌ఐబీ విడివిడిగా డీల్ చేయదు. వాటి తరఫున ఉండే ఒక నోడల్ అధికారితో డీల్ చేస్తుంది.
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీరు ఈ నెలలో అడిగిన ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు ఇవీ, సరి చూసుకోండి అని టీఎ్‌సపీల తరఫున నోడల్ ఆఫీసర్ ఎస్‌ఐబీకి మెయిల్ పంపించేవారు. ప్రభాకర్‌రావు టీం ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆధారాలు ధ్వంసం కాగానే ప్రభాకర్‌రావు బృందం తమనెవరు గుర్తించలేదని అనుకున్నారు. ప్రణీత్‌రావు 2023 డిసెంబరు నాలుగో తేదీ రాత్రి ఎస్‌ఐబీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమేరాలు ఆఫ్ చేసి 17 కంప్యూటర్లలోని ఆధారాలను ధ్వంసం చేశారు. కొన్ని వేల పేజీల డేటాను బూడిద చేశారు. 42 హర్డ్ డిస్క్‌లు తీసి వేసి కొత్త హర్డ్ డిస్క్‌లు పెట్టారు. సమాచారం ఉన్న హర్డ్ డిస్క్‌లను కట్టర్‌తో ముక్కలు చేసి మూసీలో పడేశారు. ఎస్‌ఐబీలో ప్రణీత్‌రావు అరాచకాన్ని తర్వాత కొన్ని నెలలకు ఎస్‌ఐబీ అధికారులు గుర్తించారు. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐబీ అధికారులు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పీఎ్‌సలో కేసు నమోదు అయిన మర్నాడే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు. ఆధారాలు ధ్వంసం అయిన తర్వాత పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం, కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్‌ఐబీకి వచ్చిన సిట్ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలా అని ఆలోచిస్తున్న సమయంలో టీఎ్‌సపీల నుంచి 2023 నవంబర్ నెలలో ఎస్‌ఐబీ పంపించిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన మెయిల్ విషయం వారి దృష్టికి వచ్చింది. ఇదిగో మీరు పంపించిన నెంబర్లు ఇవీ అని 615 ఫోన్ నెంబర్లకు సంబంధించిన 15 రోజుల సమాచారం టీఎ్‌సపీల నుంచి ఎస్‌ఐబీకి అంందింది.
దాంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ముందుకెళ్లే దారి దొరికిందంటూ ఆయా నెంబర్లు ఎవరివి అని గుర్తించి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ చెబుతూ, బాధితుల వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు. వేల నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటికి ఆయా నెంబర్లకు సంబంధించిన ట్యాపింగ్ చేసిన రికార్డులు అన్నీ ధ్వంసం కావడంతో చివరకు మిగిలిన 615 ఫోన్ నెంబర్లు అసలు కథను విప్పనున్నాయని దర్యాప్తు అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్న వారి సమాచారం కోసమంటూ రివ్యూ కమిటీకి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ద్వారా వెళ్లిన 615 నెంబర్లకు సంబంధించిన ఎక్కువ మంది మావోయిస్టుల కేసులతో ఎలాంటి సంబంధం లేనివారు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు కావడంతో దీన్నే ఆయుధంగా మార్చుకుని ప్రభాకర్‌రావు బృందం నేరాన్ని నిర్ధారించడానికి సిట్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బాధితుల వద్ద నుంచి నమోదు చేస్తున్న వాంగ్మూలాలను సుప్రీంకోర్టు ముందుంచి ప్రభాకర్‌రావు బృందం చేసిన అక్రమ ట్యాపింగ్‌ను వివరించి, ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయిస్తామని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తి స్ధాయి లీడ్ అధికారులకు దొరకలేదని తెలుస్తోంది.
మావోయిస్టుల పేరిట రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు శుక్రవారం నమోదు చేశారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు రాధాకృష్ణ సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను రాధాకృష్ణకు చూపించారు. నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు మావోయిస్టుల సమాచారం కోసమంటూ రాధాకృష్ణ నెంబర్‌ను 2023 నవంబరులో రివ్యూ కమిటీకి పంపారు. నవంబరులో దాదాపు 15 రోజులు రాధాకృష్ణ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం వచ్చిందా? అని రాధాకృష్ణను సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. దాదాపు గంటసేపు రాధాకృష్ణకు సిట్ అధికారి ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని తెలియచేసి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
Read Latest Telangana News and Telugu News