Share News

Puranchander Nayak: నాకు రాజకీయ అండదండలున్నాయ్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:27 AM

న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ బలవన్మరణం ఘటనలో తీవ్ర ఆరోపణలెదుర్కొంటున్న పూర్ణచందర్‌ నాయక్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి.

Puranchander Nayak: నాకు రాజకీయ అండదండలున్నాయ్‌
Swetcha Suicide Case

  • నువ్వు నన్నేమీ చేయలేవు.. స్వేచ్ఛకు పూర్ణచందర్‌ బెదిరింపులు

  • వారం క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి పయనం

  • స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తేగా కుదరదన్న పూర్ణచందర్‌

  • ఇద్దరి మధ్య వాగ్వాదం.. మనస్తాపంతో ఆమె ఆత్మహత్య

  • స్వేచ్ఛతో నా రిలేషన్‌.. జోగినపల్లి సంతోష్ కు తెలుసు!

  • ప్రస్తుతం నేను ఆయన వద్దే పనిచేస్తున్నాను

  • పోలీసులకు పూర్ణచందర్‌ వాంగ్మూలం.. అనంతరం కోర్టుకు తరలింపు.. 14 రోజుల రిమాండ్‌

  • స్వేచ్ఛ కూతురికీ వేధింపులు.. పోక్సో కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ, చిక్కడపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ బలవన్మరణం ఘటనలో తీవ్ర ఆరోపణలెదుర్కొంటున్న పూర్ణచందర్‌ నాయక్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాటిచ్చి.. ఒత్తిడి చేసి మరీ భర్త నుంచి ఆమె విడాకులు తీసుకునేలా చేసిన పూర్ణచందర్‌, తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దాటవేసేవాడని తేలింది. ఇటీవల పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చిచెప్పి.. తనకు రాజకీయంగా అండదండలున్నాయని, తననేమీ చేయలేవంటూ స్వేచ్ఛను అతడు బెదిరించినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానంటూ స్వేచ్ఛను పూర్ణచందర్‌ నమ్మించి మోసం చేయడంతోనే ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని విచారణలో తేలిందని ఏసీపీ చెప్పారు. శనివారం రాత్రి పూర్ణచందర్‌ను అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుణ్ని విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ప్రస్తుతం తాను మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వద్ద పనిచేస్తున్నానని పోలీసుల ఎదుట పూర్ణచందర్‌ వెల్లడించినట్లు తెలిసింది. స్వేచ్ఛతో తనకు ఉన్న రిలేషన్‌ గురించి సంతోష్ కు కూడా తెలుసునని, అలాగే తనతో రాజకీయ సంబంధాలున్న వారిలో చాలామందికి తెలుసునని చెప్పినట్లు సమాచారం.


కాగా స్వేచ్చ ఆత్మహత్య చేసుకోవడానికి పూర్ణచందరే కారణమని గుర్తించిన పోలీసులు అతణ్ని అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్‌ నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించారు. కేసు వివరాలను ఏసీపీ రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పూర్ణచందర్‌ నాయక్‌ 15 ఏళ్లుగా స్వేచ్ఛతో కలిసి ఉంటున్నట్లు విచారణలో తేలింది. తాను పెళ్లి చేసుకుంటానని, భర్తకు విడాకులివ్వాలని స్వేచ్ఛపై పూర్ణచందర్‌ ఒత్తిడి చేయడంతోనే ఆమె విడాకులు ఇచ్చారని విచారణలో తేలింది. అలా స్వేచ్ఛను నమ్మించిన పూర్ణచందర్‌ ఆ తర్వాత ఎన్నోసార్లు ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తనను పెళ్లి చేసుకోకుండా ఏళ్లుగా మోసం చేస్తూ వస్తుండటంతో స్వేచ్ఛ తీవ్ర మానసిక వేదనకు గురైంది. స్వేచ్ఛ కూతురును కూడా పూర్ణచందర్‌ వేధింపులకు గురిచేసినట్లు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పూర్ణచందర్‌ మంచివాడు కాదని, తనపట్ల కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని ఆ బాలిక వెల్లడించింది. అనంతరం పూర్ణచందర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో లాయర్‌తో కలిసి వచ్చి పూర్ణచందర్‌ లొంగిపోయాడని ఏసీపీ వెల్లడించారు.


తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం అతడికి లేదని తెలియడంతోనే..

ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. వారం క్రితం స్వేచ్ఛ, పూర్ణచందర్‌ కలిసి అరుణాచలం వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా స్వేచ్ఛ మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఇది ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదానికి దారితీసింది. పెళ్లి చేసుకునేందుకు పూర్ణచందర్‌ ఒప్పుకోకపోవడంతో పాటు.. తనను ఏమీ చేయలేవని, తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని స్వేచ్ఛను బెదిరించినట్లు తెలిసింది. ఈ పరిణామంతో.. తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం పూర్ణచందర్‌కు లేదని గ్రహించిన స్వేచ్ఛ.. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇది జరిగిన మూడు రోజుల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా గత ఎన్నికల్లో పూర్ణచందర్‌ ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినట్లు తెలిసింది.

Updated Date - Jun 30 , 2025 | 08:44 AM