Share News

Betting Apps: ఊరూ.. పేరూ.. మార్చి.. ఏమార్చి..

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:14 AM

రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్స్‌పై పోలీసులు వరుస కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నా.. వాటి మోసాలు మాత్రం ఆగడం లేదు. వేల కొద్ది బెట్టింగ్‌ యాప్‌లను పోలీసు‌లు బ్లాక్‌ చేయడమే కాకుండా...

Betting Apps: ఊరూ.. పేరూ.. మార్చి.. ఏమార్చి..

  • బెట్టింగ్‌ యాప్‌లపై విచారణ కొనసాగుతున్నా ఆగని దందా

  • చైనా, సింగపూర్‌పై నిఘా పెరగడంతో.. ఇండోనేషియా

  • బంగ్లాదేశ్‌, కంబోడియా వంటి దేశాలకు మకాం మార్పు

  • బాధితుల్లో తమిళుల తర్వాత తెలుగు రాష్ట్రాలవారే ఎక్కువ

  • వాడుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల వారే అత్యధికం

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్స్‌పై పోలీసులు వరుస కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నా.. వాటి మోసాలు మాత్రం ఆగడం లేదు. వేల కొద్ది బెట్టింగ్‌ యాప్‌లను పోలీసు‌లు బ్లాక్‌ చేయడమే కాకుండా... యాప్స్‌ను ప్రోత్సహించే వారికి నోటీసులు ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బెట్టింగ్‌ యాప్స్‌పై విచారణ జరుపుతున్నా.. వాటి కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. పోలీ్‌సలు బ్లాక్‌ చేసిన యాప్స్‌లో కొన్ని అక్షరాలను అటూ ఇటూ మార్చేసి కొత్త పేర్లతో మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. ఇటీవలిదాకా చైనా, సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు.. దర్యాప్తు సంస్థల నిఘా పెరగడంతో అప్రమత్తమై కంబోడియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు మకాం మార్చి తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఈ బెట్టింగ్‌ యాప్స్‌ ఉచ్చులో పడ్డవారు.. రూ.వందలు, వేలతో మొదలుపెట్టి.. రూ.లక్షలు, కోట్లల్లో మునిగిపోతున్నారు. ఇలా బెట్టింగ్‌ యాప్స్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బెట్టింగ్‌ యాప్‌ల బారినపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన తర్వాతి స్థానాల్లో.. మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి.


బెట్టింగ్‌ యాప్‌లు వాడుతున్నవారిలో 18-25 ఏళ్ల వయస్సువారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ఉపయోగిస్తున్నవారిలో 41ు మంది ఇంటర్‌ విద్యార్థులే ఉన్నట్లు తేలడం.. బెట్టింగ్‌ యాప్స్‌ ఉపయోగిస్తున్న వారిలో మహిళల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉదాహరణకు.. హైదరాబాద్‌కు చెందిన ఒక గృహిణి బెట్టింగ్‌ యాప్స్‌ ఉచ్చుకు చిక్కి ఆర్థికంగా నష్టపోయి.. నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే.. బెట్టింగ్‌ యాప్స్‌ బారిన పడుతున్నవారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇంట్లో చెప్పకుండా తెలిసిన వారి వద్ద అప్పులు చేసి.. దిక్కుతోచని స్థితిలో, భయంతో ప్రాణాలు వదులుతున్నవారు కొందరైతే కుటుంబ పెద్దల సహకారంతో అప్పులు తీర్చేస్తున్నవారు మరికొందరు. బెట్టింగ్‌ యాప్స్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయి ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే.. దర్యాప్తు సంస్థలకు తాము దొరక్కుండా ఉండేందుకు యాప్‌ నిర్వాహకులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. తాము ఎవరో తెలియకుండా ఉండేందుకు నకిలీ పేర్లు, ఖాతాలు ఉపయోగిస్తున్నారు. ఇతరుల నుంచి బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని (మ్యూల్‌ ఖాతా) వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. సంపాదించిన సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిస్తున్నారు.


కాలాన్ని బట్టి ఎర

  • సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు ప్రసాద్‌ పాటిబండ్ల

దేశంలో కరోనా తర్వాత పరిస్థితి దారుణంగా మారిందని.. కష్టపడకుండా వచ్చే సొమ్ముకు ఆశపడి యువత, మధ్యతరగతివారు బెట్టింగ్‌ యాప్స్‌, లోన్‌యా్‌ప్స ఉచ్చుకు చిక్కి సర్వం కోల్పోతున్నారని సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు ప్రసాద్‌ పాటిబండ్ల తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ‘‘విద్యా సంస్థలు ప్రారంభమయ్యే సమయంలో లోన్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తారు. అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటారు. అలాగే.. ఏదైనా క్రీడలు జరిగే సమయంలో బెట్టింగ్‌ యాప్ప్‌ను ప్రమోట్‌ చేసి డబ్బులు వసూలు చేస్తారు. వాటితోపాటే గేమింగ్‌ యాప్స్‌, ఇతర యాప్ప్‌తో దోపిడీకి పాల్పడుతున్నారు’’ అని పాటిబండ్ల వివరించారు.


ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 04:14 AM