Suryapet: కిడ్నీ మార్పిడి దందా
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:27 AM
కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు.

కోదాడకు చెందిన రైతు నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిన ఓ ముఠా
విజయవాడలో ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు
కోదాడ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. కోదాడకు చెందిన రైతు నరేశ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఏపీ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిసెంబరులో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన నరేశ్‌కు కొంతమంది పరిచయమై కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికారు. ఇందుకు అవసరమైన నగదును దశల వారీగా నరేశ్ రూ.22 లక్షలు వారికి చెల్లించారు. ఆరు నెలలు దాటినా కిడ్నీ మార్పిడి చేయించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన నరేశ్ కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై కేసు నమోదయింది.
సీఐ శివశంకర్ నేతృత్వంలో పోలీసులు ముఠా సభ్యులను గుర్తించడానికి నరేశ్‌ను విజయవాడ తీసుకెళ్లారు. ముఠాలోని ఆరుగురు సభ్యులు కె.తాతారావు, కె.రమాదేవి, డి.పృథ్వీరాజు, కె.బాబురావు, కె.విష్ణు, మహమ్మద్ సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పరారీలో ఉన్నారు. నిందితులను విచారించగా.. ఏపీలోని శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ జిల్లాలకు చెందిన 10 మందిమి ముఠాగా ఏర్పడి విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ బాధితుల వివరాలు సేకరిస్తామని అంగీకరించారు. బాధితులతో మాట్లాడి కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి వారి నుంచి రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తుంటామని తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధ్రువీకరణ పత్రాలు, రక్త నమునాలకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను బాధితులకు చూపుతామని, శస్త్రచికిత్స చేయాల్సిన సమయం దగ్గర పడినప్పుడు తప్పించుకుంటామని విచారణలో తెలిపారు. నిందితుల నుంచిఏడు సెల్‌ఫోన్లు, ఆరు రబ్బర్ స్టాంపులు, ఇంక్‌ప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
For National News And Telugu News