Passport Revoked: ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు!
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:49 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రత్యేక నిఘా విభాగం (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

అమెరికా నుంచి రప్పించేందుకు దారి సుగమం
రెడ్ కార్నర్ నోటీసు జారీ ఫలితం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రత్యేక నిఘా విభాగం (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్‌ను రప్పించడం కోసం సిట్ అధికారులు సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. ఈ నోటీసు జారీ అయిన వ్యక్తుల పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ రద్దు చేస్తోంది. వాస్తవానికి అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నం చేసినపుడు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికారులు ఆ దేశానికి సమాచారం అందించారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడం, పాస్‌పోర్టు రద్దు కావడంతో ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో అక్రమ వలసదారుడుగా మిగిలారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నారనే సమాచారాన్ని అందజేసి, వెనక్కి పంపించాలని (డిపోర్టేషన్) భారత్ అధికారుల నుంచి అమెరికాకు విజ్ఞాపన వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రావు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగియగా.. తీర్పు పెండింగ్‌లో ఉంది.
ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడైన మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు మూడుసార్లు జరిగిన విచారణలోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదని సమాచారం. ఆయనను మూడు దఫాల్లో 19 గంటలు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. శ్రవణ్‌రావు గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ‘విచారణకు సహకరించండి అప్పటి వరకు కఠిన చర్యలు వద్ద’ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరారీలో ఉండి విదేశాల్లో తలదాచుకున్న ఆయన వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో వాడిన ఫోన్లను అప్పగించే విషయంలోనూ ఆయన హస్తలాఘవం ప్రదర్శించడానికి ప్రయత్నించారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. రెండోసారి విచారణకు వచ్చినపుడు ట్యాపింగ్ సమయంలో వాడింది ఇదేనంటూ ఒక పాత సెల్‌ఫోన్‌ను ఇవ్వడానికి శ్రవణ్‌రావు ప్రయత్నించారు. అయితే సిట్ అధికారులు అప్పటికే తమ వద్ద ఉన్న ఐఎంఈఏ నెంబర్ల ఆధారంగా ఆ ఫోన్ కాదని తేల్చిచెప్పి, అసలు ఫోన్లను అప్పగించాలని హెచ్చరించారు.
దీంతో ఆయన మూడోసారి విచారణకు వచ్చినపుడు రెండు సెల్‌ఫోన్లను అప్పగించారు. ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రవణ్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి ఎలా ప్రవేశించారు? ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు? పోలీసు అధికారులు ఆయనకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు ఏ విధమైన సమాచారం ఇచ్చారు? ఆయన కార్యాలయంలో, ఇంట్లో హ్యాకింగ్ పరికరాలు ఎందుకు పెట్టుకున్నారు? వార్ రూమ్స్ తరహాలో ప్రత్యేక వసతిని ఫోన్ ట్యాపింగ్ కోసం ఎందుకు వాడారు? అనే విషయాలపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు వచ్చినప్పటికీ, ఆ విషయాలు శ్రవణ్‌రావు వాంగ్మూలం ద్వారా బయటకు రాకపోవడంతో సిట్ అధికారులు తదుపరి చర్యలకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిపిన విచారణను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసిన నేపథ్యంలో... విచారణలో శ్రవణ్‌రావు వ్యవహరించిన తీరును వివరిస్తూ ఆయన అరెస్టుకు అనుమతించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News