Share News

Asaduddin Owaisi: మీరెంత మీ బడ్జెట్‌ ఎంత

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:05 AM

పాకిస్థాన్‌ అభివృద్ధిలో అర్ధ శతాబ్దం వెనకపడిందని, వారి బడ్జెట్‌ భారత్‌ రక్షణ వ్యయం అంత కూడా కాదని ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదంపై పాక్‌ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు

Asaduddin Owaisi: మీరెంత మీ బడ్జెట్‌ ఎంత

  • మా రక్షణ వ్యయం అంతైనా ఉండదు

  • కాలమానంలో అరగంటే వెనక కావచ్చు..

  • అభివృద్ధిలో అర్ధ దశాబ్దం వెనకబడ్డారు

  • భారత్‌తో పోల్చుకోవద్దు

  • పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన ఒవైసీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): భారత్‌తో పోలిస్తే కాలమానంలో అరగంట వెనక ఉన్న పాకిస్థాన్‌... అభివృద్ధి విషయంలో అర్ధ శతాబ్దం వెనకబడిందని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పాకిస్థాన్‌ పూర్తి బడ్జెట్‌ భారత రక్షణ వ్యయం అంత కూడా ఉండదని, భారత్‌తో పోల్చుకోవద్దని ఆ దేశానికి హితవు పలికారు. మహారాష్ట్రలోని పర్భాణీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌ గురించి పాకిస్థాన్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ పెంచి పోషించిన ముష్కరులని మండిపడ్డారు. మతం అడిగి మరీ చంపడం అతి దారుణమని, వారిని మనుషులుగా కూడా గుర్తించకూడదన్నారు.


సింధు జలాల ఒప్పందం అంశంపై పాక్‌ నాయకుడు బిలావర్‌ భుట్టో జర్దారీ చేసిన వాఖ్యలను అసదుద్దీన్‌ తీవ్రంగా ఖండించారు. ‘మీ తాతను, తల్లిని చంపింది ఉగ్రవాదులేనని గుర్తుంటే నువ్వలా మాట్లాడవ’ని బిలావర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటూ ఇతర దేశాల్లోకి మారణకాండకు పాల్పడతామంటే ఎవరూ చూస్తూ ఊరుకోర’ని పాక్‌ను హెచ్చరించారు. కశ్మీర్‌ మన దేశంలో అంతర్భాగమన్నారు. కశ్మీరీలు పలువురు పర్యాటకుల ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. ముస్లింలు హిందువులపై దాడి చేశారని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. మనమంతా కలిసి పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 03:05 AM