Share News

Panchayat Elections: ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:26 PM

కామారెడ్డిలోని సోమార్‌పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు.

Panchayat Elections: ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే
Panchayat Elections

కామారెడ్డి, డిసెంబర్ 15: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన అనేక మంది ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. సర్పంచ్ ఎన్నికల కోసం భారీగా డబ్బులు వెచ్చించి ప్రచారాలు నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా కూడా కొంతమందిని మాత్రమే సర్పంచ్ పీఠం వరించింది. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కక్షలకు దారి తీశాయి. గెలిచిన అభ్యర్థులపై ఓడిన అభ్యర్థులు దాడులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ కామారెడ్డిలో మాత్రం అంతా రివర్స్ అయ్యింది. గెలిచిన అభ్యర్థికి చెందిన బంధువులు.. ఓడిపోయిన అభ్యర్థిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది.


జిల్లాలోని సోమార్‌పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురుకు గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవికి, ప్రత్యర్థి బాలరాజు వర్గంతో గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది.


ఆవేశంతో ఊగిపోయిన గెలిచిన అభ్యర్థి తమ్ముడు.. బాలరాజును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓడిన అభ్యర్థి బాలరాజుతో పాటు గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మ సత్యవ్వలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

నీ భర్తపై కేసు ఉందంటూ వృద్ధురాలికి కాల్.. చివరకు..

హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 01:31 PM