Share News

NIMS: గుండె దడకు చెక్‌

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:12 AM

గుండె దడ.. ఇది పన్నెండేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారైనా ఎదుర్కొనే సమస్య! నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 150 నుంచి 200 సార్లు కొట్టుకుంటుంది.

NIMS: గుండె దడకు చెక్‌

  • నిమ్స్‌లో రేడియోఫ్రీక్వెన్సీ క్యాథటర్‌ అబ్లేషన్‌

  • 2024లో 109 మందికి చికిత్స

  • రోగుల్లో 50 ఏళ్లలోపు వారే ఎక్కువ

  • కార్డియాలజిస్టు డాక్టర్‌ సాయి సతీష్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గుండె దడ.. ఇది పన్నెండేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారైనా ఎదుర్కొనే సమస్య! నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 150 నుంచి 200 సార్లు కొట్టుకుంటుంది. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి రోగులకు వెంటనే ‘రేడియోఫ్రీక్వెన్సీ క్యాథటర్‌ అబ్లేషన్‌’ చికిత్స అవసరం. ఇది గుండె దడకు శాశ్వత పరిష్కారం అందిస్తుందని నిమ్స్‌ వైద్యులు తెలిపారు. నిమ్స్‌లో గత ఏడాది రికార్డు స్థాయిలో 109 మందికి ఈ చికిత్స అందించామని కార్డియాలజిస్టు డాక్టర్‌ ఓరుగంటి సాయి సతీష్‌ తెలిపారు. శనివారం ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో ఇతర హృద్రోగ వైద్య నిపుణులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఇరవై ఏళ్లలో 1,100 నుంచి 1,200 మందికిపైగా బాధితులకు చికిత్స అందించి ఆరోగ్యవంతులను చేశామని తెలిపారు.


వీరిలో 12 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారి వరకు ఉన్నారని, 50 ఏళ్లలోపు వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. గుండె దడకు చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ‘సాధారణంగా గుండె నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఇది అకస్మాత్తుగా 150 వరకు, ఒక్కోసారి 200 కూడా మించిపోతుంది. గుండెలో రెండు రకాల సర్క్యూట్లు ఉంటాయి. కొందరిలో సింగిల్‌ పాత్‌వే ఉండగా, మరి కొందరిలో అదనపు పాత్‌వే ఉంటుంది. రెండు పాత్‌వేల నుంచి వేగంగా వి ద్యుత్‌ సరఫరా అయినప్పుడు గుండె స్పందనలు పెరుగుతాయి. కొందరికి పుట్టుకతోనే ఈ సమస్య ఉంటుంది. దీన్ని ‘వోల్ఫ్‌పార్కిన్‌సన్‌ వైట్‌ సిండ్రోమ్‌’గా వ్యవహరిస్తార’ని తెలిపారు. దీని వల్ల ఛాతీలో నొప్పి, ఆయాసం, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన చెప్పారు.


చికిత్స ఇలా..

గుండె దడకు నిమ్స్‌లో అధునాతన వైద్య పరికరాల సాయంతో చికిత్సను అందిస్తామని డాక్టర్‌ సాయి సతీష్‌ తెలిపారు. ‘ఈ చికిత్స కోసం 3 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. గుండె దడతో ముప్పు ఉన్న బాధితులకు 3డీ మ్యాపింగ్‌తో, కాస్త తక్కువ దడ ఉన్న వారికి 2డీ మ్యాపింగ్‌తో చికిత్స అందిస్తాం. ఎలక్ట్రిక్‌ సర్క్యూట్‌ ద్వారా గుండె దడ పెరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎలా వస్తోంది, కారణాలను నిర్దారిస్తాం. దానివల్ల ఎంత ముప్పు ఉందో అంచనా వేసి చికిత్స అందిస్తాం. గుండె దడ ఉన్న వారు ఎక్కువ కాలం మందులు వాడినా ముప్పు పొంచి ఉంటుంది. వారికి రేడియోఫ్రీక్వెన్సీ క్యాథటర్‌ అబ్లేషన్‌ ఒక్కటే మార్గం. ఈ చికిత్స తర్వా త రోగి మందులు వాడాల్సిన అవసరం ఉండద’ని ఆయన వివరించారు. ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి, ఆర్టీసీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌, సీజీహెచ్‌సీ హెల్త్‌ కార్డులు ఉన్న వారికి ఉచితంగా రేడియోఫ్రీక్వెన్సీ క్యా థటర్‌ అబ్లేషన్‌ చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Updated Date - Jan 05 , 2025 | 04:12 AM