Hyderabad: ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో నెలకు 1000 కొత్త కేసులు!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:45 AM
రాజధాని హైదరాబాద్‌లోని మెహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్‌జే) క్యాన్సర్ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రికి రోజూ సుమారు 700 మంది దాకా అవుట్ పేషంట్స్ వస్తారు.

18 రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాన్సర్ బాధితులు
గత ఐదు నెలల్లో 5257 కొత్త కేసుల నమోదు
నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌లే 40 శాతం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని మెహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్‌జే) క్యాన్సర్ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రికి రోజూ సుమారు 700 మంది దాకా అవుట్ పేషంట్స్ వస్తారు. రోజూ వచ్చే కేసుల్లో కొత్తగా 30-35 మందికి క్యాన్సర్ నిర్ధారణ అవుతున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇలా గత నాలుగేళ్లలో ఏకంగా 49,166 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2021లో 10,712 కొత్త కేసులు రాగా, మరుసటి ఏడాదిఆ సంఖ్య 12,089కి పెరిగింది. 2023లో 12,728 కొత్త కేసులు నమోదు.. కాగా నిరుడు 13,637 కేసులు వచ్చాయి. కాగా.. ఎంఎన్‌జేలో నమోదయ్యే ప్రతి వంద కొత్త కేసుల్లో 18-19 నోటి క్యాన్సర్‌వే ఉంటున్నాయి. రొమ్ము క్యాన్సర్ కేసులు 12 శాతం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ 9-10 శాతం నమోదు అవుతున్నాయి. అంటే ఈ మూడు రకాల క్యాన్సర్లే సుమారు 39-40 శాతం వరకు ఉంటున్నట్లు. మిగతా అన్ని రకాలూ కలిసి మరో 60 శాతం కేసులు ఉంటున్నాయి.
ఉత్తరాది నుంచి..
ఎంఎన్‌జే ఆస్పత్రిలో గత ఐదు నెలల్లో 5,257 కొత్త కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 550 మందికిపైగా ఇతర రాష్ట్రాలవారే. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. మొత్తం 18 రాష్ట్రాలకు చెందిన రోగులు ఎంఎన్‌జేలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 54 మంది ఇక్కడ వైద్యం చేయించుకుంటుండగా.. బిహార్‌వాసులు 24 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 15 మంది, పశ్చిమబెంగాల్ నుంచి 10 మంది, ఒడిశా నుంచి 12 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే రాజస్థాన్, పంజాబ్, ఛత్తీ్‌సగఢ్, మణిపూర్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ము కశ్మీర్, హరియాణా, అసోం నుంచి కూడా పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు. నేపాల్ నుంచి సైతం ఇద్దరు రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు. అనుభవజ్ఞులైన క్యాన్సర్ వైద్య నిపుణులు, సమర్థమైన చికిత్స అందుతుందన్న నమ్మకం ఉండడం వల్లనే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నట్లు రోగులు చెబుతున్నారు.
పెరుగుతున్న ముప్పు..
మన దేశంలో రోజూ సగటున 200 మందికిపైగా మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. అన్ని రకాల క్యాన్సర్లతో.. రోజుకు సగటున 1600-1700 మంది చనిపోతున్నట్లు ఐసీఎంఆర్‌తో పాటు ఇతర సంస్థలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరికి కొత్తగా 15 లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యే ముప్పుందనే హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి. 2019లో దేశవ్యాప్తంగా 7.51 లక్షల క్యాన్సర్ మరణాలు సంభవించగా.. 2023 నాటికి ఆ సంఖ్య 8.28 లక్షలకు పెరిగిందని నిరుడు డిసెంబర్‌లో కేంద్ర వైద్యశాఖ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక పేర్కొంది.
‘ఆయుష్మాన్ భారత్’తో ఉత్తరాది వారికి చికిత్స
మన రాష్ట్ర రోగులకు ఆరోగ్య శ్రీ కింద.. ఉత్తరాదివారికి, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా వైద్య సేవలందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డుతో పాటు క్యాన్సర్ రోగులకు కేంద్రం ఇచ్చే వన్‌టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూ.10 లక్షలు, ప్రధానమంత్రి సహాయ నిధి వంటి వాటి ద్వారా ఇక్కడికి వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పేద రోగులు ఇక్కడికి చికిత్స కోసం వస్తున్నారు. ఎటువంటి ఆరోగ్య బీమా లేని పేద రోగులు వస్తే వారికి ఉచితంగానే చికిత్స చేస్తున్నాం.
-డాక్టర్ జి. శ్రీనివాస్, డైరెక్టర్, ఎంఎన్‌జే ఆస్పత్రి, హైదరాబాద్