Hyderabad: మోడల్ కాకుంటే.. రాజకీయాల్లో ఉండేదాన్ని
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:08 AM
మోడల్ కాకుండా ఉండిఉంటే.. తాను కచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాన్నని, థాయ్‌లాండ్‌కు అంబాసిడర్‌గా సేవలందించడమే తన కర్తవ్యమని మిస్ వరల్డ్-2025 టైటిల్ విజేత ఓపల్ ఉద్ఘాటించారు.

రొమ్ము క్యాన్సర్ రావడంతో భయపడ్డా.. ఆ భయమే ధైర్యాన్నిచ్చి, ముందుకు నడిపింది
క్యాన్సర్‌పై అవగాహనకు ‘ఓపల్ ఫర్ హర్’ ప్రాజెక్టును ప్రారంభించా
అందాల పోటీలతోనే ప్రపంచానికి.. నా గొంతును వినిపించగలననే నమ్మకం
‘ఆంధ్రజ్యోతి’తో మిస్‌వరల్డ్ ఓపల్
హైదరాబాద్ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): మోడల్ కాకుండా ఉండిఉంటే.. తాను కచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాన్నని, థాయ్‌లాండ్‌కు అంబాసిడర్‌గా సేవలందించడమే తన కర్తవ్యమని మిస్ వరల్డ్-2025 టైటిల్ విజేత ఓపల్ ఉద్ఘాటించారు. తనకు 16వ ఏట రొమ్ము క్యాన్సర్ రావడంతో భవిష్యత్‌పై ఆశలన్నీ ఛిద్రమైపోయినట్లు భావించానని, ఆ భయమే తనలో ధైర్యాన్ని నింపాయని చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే ‘ఓపల్ ఫర్ హర్’ ప్రాజెక్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అందాల పోటీల్లో పాల్గొంటే.. తన గొంతును ప్రపంచానికి వినిపించవచ్చనే ఉద్దేశంతో మోడల్‌గా మారారు. మిస్ వరల్డ్ థాయ్‌లాండ్‌గా నిలిచి.. మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్-2024లో మూడోస్థానాన్ని సాధించారు. ఇప్పుడు.. ‘మిస్ వరల్డ్-2025’ టైటిల్‌ని సాధించారు. మిగతా పోటీదారుల కంటే ముందే హైదరాబాద్ చేరుకున్న ఓపల్.. వేడుకలకు ముందు ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చరించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
15 రోజుల్లో సిద్ధమయ్యా
కేవలం 15 రోజుల్లో ఈ పోటీలకు ఎంపికై.. ఇక్కడకు రావడం ఓ అద్భుతమనే చెప్పాలి. నా 18వ ఏట తొలిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి పోటీపడుతూనే ఉన్నా.
భయమే.. ధైర్యంగా నడిపింది
వైద్యులు నా 16 ఏళ్ల వయసులో రొమ్ములో పెద్ద కణితిని కనుగొన్నారు. అది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. ఈ దశను విజయవంతంగా అధిగమించాలని, నాకు నేను వాగ్దానం చేసుకున్నా. దాని కోసమే ప్రయత్నించా. ‘ఓపల్ ఫర్ హర్’ ప్రాజెక్టును ప్రారంభించా. ఈ ప్రాజెక్ట్ ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది. కొందరు ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడి, విజయం సాధించారు. సమస్యను ముందుగానే గుర్తిస్తే.. అధిగమించవచ్చని.. ఆ దిశగా కృషిచేస్తున్నా.
హైదరాబాద్‌తో సంబంధం
హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ అనుభూతిని ఎన్నటికీ మరిచిపోలేను. నాకు జన్మనిచ్చిన పుకెట్‌కు, హైదరాబాద్‌కు సంబంధం ఉంది. హైదరాబాద్ మాదిరిగానే మాది ‘ముత్యాల నగరి’. అందుకే.. హైదరాబాద్ నా మనసుకు నచ్చిన నగరంగా మారింది.
తెలంగాణ ఆతిథ్యం అపూర్వం
తెలంగాణ ప్రభుత్వ సహకారం, మద్దతు.. అన్నింటికీ మించి ఆతిథ్యం అపూర్వం. తెల్లవారుజామున 2 గంటలకు విమానాశ్రయంలో దిగగానే.. నన్ను ఆహ్వానించడం సంతోషాన్నిచ్చింది. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇక్కడివంటలు చాలా బాగున్నాయి. ఇక్కడి ప్రజల మోముల్లో చిరునవ్వు నాకు చాలా నచ్చింది. నా ఇంట్లో ఉన్న ట్లే ఫీల్ అయ్యాను. ఆభరణాలకు నేను పెద్ద అభిమానిని. హైదరాబాద్ పాతనగరంలో ముత్యాలను అన్వేషించాలనుకుంటున్నాను.
ఆలయాలకెళ్తే ప్రశాంతత
నేను థాయ్‌లాండ్‌లో ఓ దేవాలాయాన్ని సందర్శించినప్పుడు.. అక్కడ పొందిన అనుభూతి అద్భుతమనిపించింది. మరో ప్రపంచంలా ఫీలయ్యాను. దేవాలయాల్లోని ప్రశాంతతను ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే..! హైదరాబాద్‌తోపాటు.. భారత్‌లోని దేవాలయాలను సందర్శించాలనుకుంటున్నాను. దేవాలయాల్లో ఏదో తెలియని శక్తి మనకు లభిస్తున్నట్లు అనిపిస్తుంది.
మోడల్ కాకపోయి ఉంటే..
ఒకవేళ నేను మోడలింగ్ రంగంలోకి రాకపోతే.. రాజకీయాల్లో ఉండేదాన్ని. ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన విభాగంలో పనిచేసేదాన్ని. భవిష్యత్‌లో థాయ్‌లాండ్ అంబాసిడర్‌గా సేవలందించాలన్నదే నా కోరిక.
జంతువులపై సోదరి ప్రేమ
నాకు జంతువులంటే చాలా ఇష్టం. మా ఇంట్లో 18 పిల్లులు, 5 శునకాలు ఉన్నాయి. వాటిని నా తోబుట్టువుల్లానే చూస్తాను. వాటిపై సోదరి ప్రేమను చూపుతాను.
మిస్ వరల్డ్‌గా టైటిల్‌పై..
ఒకవేళ నేను మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే.. థాయ్‌లాండ్ ఈ కిరీటాన్ని అందుకోవడం తొలిసారి అవుతుంది. మిస్ వరల్డ్‌గా.. ఆరోగ్య పరంగా మహిళల జీవన స్థితిగతులను మార్చాలనుకుంటున్నాను. ముఖ్యం గా రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారి జీవితాలను మార్చాలన్నదే నా ఆశయం. మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. దాని పట్ల కూడా అవగాహన కల్పించాలనుకుంటున్నాను. యువతరం కూడా ఈ వ్యాధి బారిన పడుతోంది. అందుకే.. యువతరం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి మించిదేమీలేదు. యువతరం ఆరోగ్యంగా ఉంటే.. ఈ ప్రపంచాన్నే మార్చగలరు.
ఇవి కూడా చదవండి
జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం
ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..