Siddipet: ఏడాదిన్నర కాలంలో లక్ష కోట్లు ఖర్చుపెట్టాం
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:25 AM
గత ప్రభుత్వ విధ్వంసాలతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామని మంత్రులు అన్నారు.

సంక్షేమంలో రాజీ లేదు: మంత్రులు
హుస్నాబాద్‌కు పొన్నం, తుమ్మల, కోమటిరెడ్డి, దామోదర..
నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పరిశీలన
సిద్దిపేట, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ విధ్వంసాలతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామని మంత్రులు అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వారు పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నర్మెటలో 300 కోట్లతో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీని ఆగస్టులో సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని ప్రకటించారు. మరో మంత్రి దామోదర మాట్లాడుతూ ‘సీసాలు, పైసల కోసం ఓట్లు అమ్ముకోవద్దని, మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని’ తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ కోసం సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీనే త్యాగం చేశారని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కనీసం వార్డుమెంబర్ కూడా లేడని అన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ తనను గెలిపించిన హుస్నాబాద్ ప్రజల గౌరవాన్ని పెంచడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఆనాడు నక్సలైట్లకు ఆ తర్వాత కమ్యూనిస్టులకు కేంద్రంగా ఉన్న జిల్లా ఇప్పుడు కాంగ్రె్‌సకు కేరాఫ్ అడ్ర్‌సగా మారిందని అన్నారు. మంత్రి పొన్నంతో ఇతర మంత్రులు జరిపిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని పొన్నం మిగతా మంత్రులను పదేపదే చేతులెత్తి దండం పెడుతూ అడిగారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌నే పేల్చివేస్తానని పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చాడని గుర్తు చేశారు. ‘నువ్వేదడిగితే అది ఇవ్వడానికి అందరం సిద్ధంగానే ఉన్నామని, నిధుల కోసం అడగడం కాదు.. ఆర్డర్ వేయాలని’ నవ్వుతూ చెప్పారు.
మంత్రాలు చదివిన కలెక్టర్
మంత్రుల పర్యటనలో భాగంగా మాతా, శిశు ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట కలెక్టర్ హైమవతి మంత్రాలు చదివి ఆకట్టుకున్నారు. ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలని కలెక్టర్‌కు సూచించగా, ఆమె మంత్రాలు చదువుతూ రిబ్బన్ కట్ చేశారు. దీంతో మంత్రాలు బాగా చదివారంటూ మంత్రులు కలెక్టర్‌కు కితాబునిచ్చారు.
దక్షిణ భారత రైతులంటే కేంద్రానికి చిన్నచూపు: తుమ్మల
దక్షిణ భారత రైతులంటే కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి చిన్న చూపేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం రూ.లక్ష కోట్లు పెట్టి ఆయిల్‌పామ్ దిగుమతి చేసుకునే బదులు తెలంగాణ రైతులకు సహకరిస్తే ఆ లక్ష కోట్ల మారక ద్రవ్యాన్ని నిలుపుకోవచ్చని చెప్పారు. ఆయిల్‌పామ్ పంటకు కనీసం రూ.25 వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంలో ఆయిల్‌పామ్ సాగు లేదని, తెలంగాణలోనే ఎక్కువ ఉత్పత్తవుతుందని చెప్పారు. ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని తొలుత 27 శాతం పెంచిన కేంద్రం ఆ తర్వాత దానిని 10 శాతానికి తగ్గించడం వల్ల రైతులు బాధపడుతున్నారని తెలిపారు. కేంద్రం పునరాలోచించి ఈ విషయంలో రైతులకు లాభం జరిగేలా చూడాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
Read Latest Telangana News and Telugu News