Share News

Sigachi Industries: సిగాచి పేలుడుపై కమిటీ ఏర్పాటు.. నివేదికకు గడువు విధించిన సర్కార్

ABN , Publish Date - Jul 02 , 2025 | 08:38 PM

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Sigachi Industries: సిగాచి పేలుడుపై కమిటీ ఏర్పాటు.. నివేదికకు గడువు విధించిన సర్కార్
Blast in Sigachi Industries

సంగారెడ్డి, జులై 02: పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడుపై దర్యాప్తునకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ఆ కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

నిపుణుల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని.. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన అంశాలు పరిశీలించడం.. సిఫార్సులతోపాటు వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా డాక్టర్ బి. వెంకటేశ్వరరావు వ్యవహరిస్తారు. మరో ముగ్గురు సభ్యులు ఉంటారు.


నలుగురు సభ్యుల కమిటీ వివరాలు..

కమిటీ ఛైర్మన్‌ డాక్టర్ బి. వెంకటేశ్వరరావు. సైంటిస్ట్, సీఎస్ఐఆర్, ఐఐసీటీ

సభ్యులుగా..

1) డాక్టర్ టి. ప్రతాప్ కుమార్, చీఫ్ సైంటిస్ట్, సీఎస్ఐఆర్, ఐఐసీటీ

2) డాక్టర్ సూర్య నారాయణ, రిటైర్డ్ సైంటిస్ట్, సీఎస్ఐఆర్, ఐఐసీటీ హైదరాబాద్. చీఫ్ సైంటిస్ట్,

3) డాక్టర్ సంతోష్ ఘుగే, సేఫ్టీ ఆఫీసర్, సీఎస్ఐఆర్, ఎన్‌సీఎల్, పుణె


ఈ కమిటీ పరిశీలించే అంశాలు..

1) ప్రమాదానికి గల కారణాలు గుర్తించి, యూనిట్‌లో కార్మికుల భద్రత కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOP) పాటిస్తున్నారా? లేదా అనేది గుర్తించడం.

2) పారిశ్రామిక విభాగంలో కంపెనీ యాజమాన్యం అనుసరించాల్సిన రసాయన, పారిశ్రామిక ప్రక్రియల లేకపోవడం.. లేదా సమ్మతి లేకపోవడం లేకుంటే ఉల్లంఘనలకు పాల్పడ్డారా? అనే కోణం విచారణ జరపడం.

3) భవిష్యత్తులో రసాయన, ఔషధ పారిశ్రామిక యూనిట్లలో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా.. ఈ కమిటీ కీలక సూచనలు అందించాల్సి ఉంటుంది.


సిగాచి ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటన..

ఇస్నాపూర్ మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐలా కార్యాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వారి కుటుంబ సభ్యులకు భోజనం, తాత్కాలిక నివాసంతోపాటు రవాణా తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. అలాగే బాధితులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇక ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల అధికారులు సైతం సహాయక చర్యలు అందిస్తున్నారని తెలిపారు.


ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 143 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. వారిలో 60 మంది సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. 35 మంది గాయపడి.. చికిత్స పొందుతున్నారన్నారు. 38 మంది మృతి చెందారని తెలిపారు. వారిలో 18 మంది మృతదేహాలను గుర్తించామని.. వాటిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. మరో 20 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు.


10 మంది ఆచూకీ లభ్యం కాలేదని పేర్కొన్నారు. డీఎన్‌ఏ ఫలితాల కోసం 18 నమూనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు ఇంకా రెండు మృతదేహాల నమూనాలు సేకరించాల్సి ఉందన్నారు. 36 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయిందని వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.1,00,000 చొప్పున నగదు మంజూరు చేసినట్లు చెప్పారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందించామని వివరించారు.


ఆచూకీ తెలియని 10 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10,000 చొప్పున తాత్కాలిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. బాధిత కుటుంబాలు లేదా వారి బంధువులు సమాచారం కోసం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ నంబర్ 08455-276155 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెంబర్ ద్వారా సంప్రదించ వచ్చని ప్రావీణ్య సూచించారు.

ఇవి కూడా చదవండి..

ఐపీఎస్‌కి రాజీనామా.. ఎందుకంటే..

సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 02 , 2025 | 08:50 PM