CM Revanth Reddy: తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారుబెనీ
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:40 AM
జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రె డ్డిని కలుసుకున్నారు.

600 ఎకరాల్లో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
దశలవారీగా రూ.5,000 కోట్లకు పెరిగే అవకాశం
30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు
లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ఉభయ పక్షాల సంతకాలు
తెలంగాణకు స్వాగతం.. మారుబెనీ ప్రతినిధులతో సీఎం
మెట్రో, మూసీ, రేడియల్ రోడ్లకు సహకరించండి
మెట్రో రెండో దశ విస్తరణకు 11,693 కోట్ల రుణమివ్వండి
జైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా
సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం
అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు యోచన: సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో ‘నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు’ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రె డ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. అనంతరం ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలోకి మారుబెనీ కంపెనీకి ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసే మొట్టమొదటి పార్కు ఇదేనని అన్నారు. మారుబెనీ కంపెనీ ఏర్పాటుతో తెలంగాణలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని, మారుబెనీకి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ మారుబెనీ కంపెనీ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా, తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ ఎంచుకున్న దార్శనికతను మారుబెనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అఽధికారి దైసకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. అక్కడున్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామని అన్నారు.
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ఇలా..
జపాన్ కంపెనీలతోపాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. ఫలితంగా, దశలవారీగా దాదాపు రూ.5,000 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నట్టు అంచనా. ఇక, మారుబెనీ ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలకా్ట్రనిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరో స్పేస్‌తోపాటు రక్షణ రంగాలపై దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపడుతుంది. మారుబెనీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కిపైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరో స్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికిపైగా ఉద్యోగులు ఈ కంపెనీల్లో పని చేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
రుణం ఇస్తే టోక్యోను మించిపోతాం
న్యూయార్క్, టోక్యో వంటి అంతర్జాతీయ స్థాయి నగరాలతో సమానంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తమ ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తే టోక్యో నగరాన్ని మించిన అభివృద్ధి సాధిస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత స్థాయి ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమీకరించేందుకు జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం గురువారం జైకా ప్రతినిధులతో సమావేశమైంది. ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలను సీఎం రేవంత్ వారికి వివరించారు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా.. హైదరాబాద్‌ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.24,269 కోట్ల అంచనాతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం.. అంటే రూ.11,693 కోట్లు రుణం అందించండి. ఇందుకు భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుంది’’ అని స్పష్టం చేశారు. మెట్రోతోపాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు, కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని కోరారు. అయితే, తెలంగాణతో జైకాకు ఏళ్ల తరబడి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పిన షోహెయ్ హరా.. మెట్రో రైలు విస్తరణతోపాటు ఇతర ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ బృందం టోక్యో నగరంలోని మెట్రో రైలు వ్యవస్థను సందర్శించింది. టోక్యోలో తొమ్మిది లైన్లతో నిర్వహిస్తున్న రైళ్లు, కార్యాచరణ సామర్థ్యం, సాంకేతిక వినియోగంపై ఆరా తీసింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ప్రణాళికలను రూపొందించడంలో భాగంగా ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు టోక్యో మెట్రోను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.
సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం టీమ్
జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం.. గురువారం అక్కడి సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందానికి ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రంచైరోల్‌పై సీఎం రేవంత్ బృందం వివరణాత్మకంగా చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎ్‌ఫఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించింది. ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే తన భవిష్యత్తు విజన్‌ను సీఎం రేవంత్ వారితో పంచుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను