Mahesh Kumar Goud: బీజేపీతో బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:02 AM
బీఆర్‌ఎస్ నేతలు అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి చర్యలను కేటీఆర్ అజ్ఞానంగా విమర్శించడంపై మండిపడ్డారు.

అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): దొంగలముఠా వలే రాష్ట్రాన్ని పదేళ్లపాటు దోచుకున్న బీఆర్‌ఎస్ నేతలు అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. తమ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ఉండేందుకే మోదీకి దాసోహమయ్యారని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబడి పోయిందన్నారు. గడిచిన పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన అన్నిబిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతునిచ్చిన విషయాన్ని మరిచిపోయారా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
మోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీకి ఊడిగం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పనిచేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీపై బీఆర్‌ఎస్‌కున్న ప్రేమతోనే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రెండు పార్టీల నేతల దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేని బీజేపీ ఎవరి అండ చూసుకుని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల స్పల్పకాలంలోనే రికార్డు స్థాయిలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ, రైతు, మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నట్టు ఆయన వివరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ , పేదలకు సన్న బియ్యం వంటి గొప్ప పనులను రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.