Mahalakshmi Scheme Free Bus Travel: ఆర్టీసీకి మహాలక్ష్మి
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:59 AM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

ఆ పథకం కింద 200 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణాలు
వాటి టికెట్ల మొత్తం రూ.6,680 కోట్లు
ఆర్టీసీకి చెక్కు అందించిన ప్రభుత్వం
నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ: భట్టి
మహిళల దైనందిన జీవితంలో ‘మహాలక్ష్మి’
పథకం భాగమైంది: మంత్రి పొన్నం
ఎంజీబీఎస్‌లో సంబురాలు
ఆర్టీసీ సిబ్బందికి డిప్యూటీ సీఎం సన్మానం
హైదరాబాద్ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాలు 200 కోట్ల మార్కు దాటిన నేపథ్యంలో.. బుధవారం ఎంజీబీఎస్ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళలను, ఆర్టీసీ సిబ్బందిని డిప్యూటీ సీఎం సన్మానించారు. 200 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలు ఆదా చేసుకున్న రూ.6,680 కోట్ల చెక్‌ను ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ పథకానికి సంబంధించి.. జీరో టికెట్ల రీయింబర్స్‌మెంట్ సొమ్మును ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి అందజేస్తోందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ఆర్టీసీ 2400 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు నగరంలో ఉన్న 2800 బస్సుల స్థానంలో విద్యుత్తు బస్సులు తెచ్చే దిశగా ఆర్టీసీ కసరత్తు చేస్తున్నట్టు భట్టి తెలిపారు. ఈమేరకు 3000 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ పెట్టిందని.. వాటిలో 11 శాతం బస్సులు ఇప్పటికే వచ్చాయని వెల్లడించారు. ఆ బస్సుల సంఖ్యను ఇంకా పెంచుతామన్నారు.
యజమానుల్ని చేసింది..
కోటి మంది మహిళలను కోటేశ్వరులనే చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. అందులో భాగంగా మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులను కొనిపించి వారిని యాజమానులను చేసిందని భట్టి తెలిపారు. ఈమేరకు 150 మహిళా సంఘాలకు రూ.కోటి విలువైన చెక్కులు అందించినట్టు చెప్పారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర.. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఇక.. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. మహిళల దైనందిన జీవితంలో మహాలక్ష్మి పథకం భాగమైందన్నారు. మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేసిన సందర్భంగా రాష్ట్రంలోని 97 డిపోలు, 324 బస్ స్టేషన్లలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలుతో పాటు నియామకాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తునట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా.. బస్సుల్లో ఉచిత ప్రయాణాలతో ప్రతి నెలా రూ.3-4 వేలు ఆదా అవుతున్నాయంటూ పలువురు మహిళా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
‘మహాలక్ష్మి’ని ఇతర రాష్ట్రాలూ అనుసరిస్తున్నాయి
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: తుమ్మల
ఖమ్మం/కొత్తగూడెం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని.. ముఖ్యంగా ‘మహాలక్ష్మి’ పథకాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరిస్తున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గడిచిన 18నెలల కాలంలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్ల మార్కు దాటిన నేపథ్యంలో బుధవారం ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్, కొత్తగూడెం బస్టాండ్‌లో నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పథకంకిఇంద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.6700 కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఈపథకం ద్వారా నిరుపేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడిందన్నారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం బస్టాండ్ నుంచి రఘునాథపాలెం మండలం మూలగూడెం వరకూ బస్సులో వెళ్లారు. గతంలో ఆ గ్రామానికి బస్సు నడిపిస్తానని ఇచ్చిన హామీ మేరకు... ఆ సర్వీసును ప్రారంభించి, కండక్టర్‌కు రూ.30 చెల్లించి టికెట్ తీసుకుని గ్రామస్థులతో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News