Share News

KTR: సీఎం సిగ్గున్నోడైతే..

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:16 AM

సీఎం రేవంత్‌రెడ్డిలాగా తాము లేకిపనులు చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు పెట్టలేదని, ఇతర పార్టీల కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు.

KTR: సీఎం సిగ్గున్నోడైతే..

  • బకెట్‌ నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు

  • అలాంటిదేమీ లేనందునే ప్రజలు తిట్టినా పట్టించుకోవట్లే

  • రేవంత్‌రెడ్డిలాగా మేం లేకి పనులు చేయలేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిలాగా తాము లేకిపనులు చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు పెట్టలేదని, ఇతర పార్టీల కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు. ఎన్నికల్లో హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇంతలా తిడుతున్న ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరని.. సిగ్గు, శరం ఉన్నోడయితే ఈపాటికి బకెట్‌ నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడని విమర్శించారు. ఆయనకు సిగ్గు, శరం లేదు కాబట్టే ప్రజలు ఎంత తిట్టినా పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి పోతే తమను చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లాగా చూస్తున్నారని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకుంటారా? అని నిలదీశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్‌లాంటి గొప్ప ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు రేవంత్‌రెడ్డిని చూసి ‘ఛీ’ అనుకుంటున్నారని చెప్పారు.


నర్సింగ్‌ అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెడితే పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి తీవ్రంగా హింసించారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ముఖ్యమంత్రిని పొగడడమే పనిగా పెట్టుకోవాలా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని నిలదీశారు. హరీశ్‌ దగ్గర రేవంత్‌రెడ్డి శిష్యరికం చేశారని, అప్పట్లో హరీశ్‌ మంత్రి అయినపుడు ఇదే తెలంగాణభవన్‌ ముందు ఆయన డ్యాన్సులు కూడా చేశారని.. అలాంటి వ్యక్తి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని సీఎం చెబుతున్నారని, అందుకే వంద కాదు వాని బొంద అని విమర్శించానని చెప్పారు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలో చేరడమంటే సాధారణ విషయం కాదన్నారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేవరకు కష్టపడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్‌లో కొన్ని గాడిదలున్నాయని.. వాటి సంగతి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్‌ హెచ్చరించారు. మంత్రి సీతక్క అనుచరుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్‌ మృతికి నిరసనగా బీఆర్‌ఎస్‌ చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2 వేల మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారో ములుగు పోలీసులు చెప్పాలన్నారు. రమేశ్‌ ఆత్మహత్యకు కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదు చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.


సిరిసిల్ల నియోజకవర్గంలో కేసీఆర్‌ కిట్లు అందిస్తా

తన జన్మదినం సందర్భంగా సిరిసిల్లలో 4910 మందికి కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. మాతా శిశు మరణాలను తగ్గించి, వారికి మంచి ఆరోగ్యాన్ని అందించేలా బీఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన కేసీఆర్‌ కిట్లను సీఎం రేవంత్‌ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే సిరిసిల్ల జిల్లాలో గత 18 నెలల్లో పుట్టిన ప్రతి శిశువుకు కేసీఆర్‌ కిట్‌ను అందిస్తానన్నారు.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:16 AM