Share News

seethakka: కేటీఆర్‌.. దమ్ముంటే రాధాకృష్ణను టచ్‌ చెయ్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:40 AM

కేటీఆర్‌.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిజామాబాద్‌ జిల్లా బిర్కూర్‌కు చెందిన వ్యక్తి అని, దమ్ముంటే ఆయన్ను టచ్‌ చేసి చూడాలని సవాలు చేశారు

seethakka: కేటీఆర్‌.. దమ్ముంటే రాధాకృష్ణను టచ్‌ చెయ్‌

  • దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయ్‌

  • ‘ఆంధ్రజ్యోతి’కి కాంగ్రెస్‌ అండగా ఉంటుంది.. ఆ పార్టీ నేతల స్పష్టీకరణ

  • దాడికి రెచ్చగొడుతోంది కేటీఆరే: సీతక్క

  • ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే.. టీ న్యూస్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేస్తాయ్‌: రమేశ్‌రెడ్డి

  • రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ: మైనంపల్లి

  • తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కేటీఆర్‌.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిజామాబాద్‌ జిల్లా బిర్కూర్‌కు చెందిన వ్యక్తి అని, దమ్ముంటే ఆయన్ను టచ్‌ చేసి చూడాలని సవాలు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ములుగు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరిపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దాడి చేసినట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. మహా న్యూస్‌ కార్యాలయంపై దాడి చేసింది, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నిస్తున్నదీ బీఆర్‌ఎస్‌ నేతలే అన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై దాడికి బీఆర్‌ఎస్‌ నాయకులను రెచ్చగొడుతోంది కేటీఆరేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘ఆంధ్రజ్యోతి’పై దాడి చేస్తే టీ న్యూస్‌ కార్యాలయంపై గంటలోపు దాడి చేయడానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నాయకుల తీరు తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉందన్నారు. పత్రికలు నిజాలు చెబితే జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్‌ నాయకులు వాటి మీద దాడులు చేసి, సిగ్గు లేకుండా సమర్ధించుకునేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కేటీఆర్‌, హరీశ్‌, జగదీశ్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే.. దాడులు ఉంటాయని బెదిరిస్తున్నారని, బిహార్‌ తరహా రౌడీయిజాన్ని తెలంగాణలో అమలు చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసి, దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పు ఉంటే పత్రికల్లో ఎత్తిచూపుతారని, మంచి ఉంటే దాన్నే ప్రజలకు తెలియజేస్తారని అన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రోజురోజుకూ పతనం కావడంతో కేటీఆర్‌ మైండ్‌ పని చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై దాడులు చేస్తామని చెప్పారని.. ‘కేటీఆర్‌.. నీకు దమ్ముంటే ఆంధ్రజ్యోతిని టచ్‌చేసే ముందు నన్ను, నా కార్యకర్తలను టచ్‌ చేయి’ అని సవాలు చేశారు. రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ అన్నారు.


పదేళ్ల పాటు ఆంధ్రా ప్రజల్ని వాడుకొని.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రా అని వేరు చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘బిడ్డా.. ప్రాంతాలు, కులాల పేరుతో వేరుగా మాట్లాడితే ఉరికించి కొడతాం. కేటీఆర్‌.. మీడియా మీద చెయ్యేస్తే నీ అంతు చూస్తా’ అని హెచ్చరించారు. గతంలో ఏబీఎన్‌పై నిషేధం విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారని గుర్తుచేశారు.

ఖబడ్దార్‌ బీఆర్‌ఎస్‌..

నిజాలను నిగ్గు తేల్చే ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తామని బెదిరిస్తారా? ఖబడ్దార్‌ బీఆర్‌ఎస్‌.. ఖబడ్దార్‌ కేటీఆర్‌.. అంటూ గడ్డిఅన్నారం చౌరస్తాలో మంగళవారం మూసారాంబాగ్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లింగాల శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కుతారా? అని మండిపడ్డారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచే ఆంధ్రజ్యోతిపై దాడులకు కుట్రలు పన్నితే కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే మూల్యం తప్పదు

మీడియా అనుకూలంగా ఉంటే పూలదండలు, లేకుంటే దాడులు చేస్తామనడం సరికాదని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య తెలిపింది. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్‌ఎస్‌ దాడులు చేస్తే కేటీఆర్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సమాఖ్య సెక్రటరీ జనరల్‌ సాగరపు ప్రసాద్‌ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏబీన్‌-ఆంధ్రజ్యోతి సహకరించిందని గుర్తుచేశారు. ఆంధ్రజ్యోతి ప్రజల పత్రిక, ఏబీఎన్‌ దమ్మున్న చానల్‌.. ఈ సంస్థలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. మీడియా సంస్థలపై చెయ్యేస్తే టీ న్యూస్‌ అంతు చూస్తామన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 04:40 AM