Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో పెరిగిన పొలిటికల్ హీట్.. నేటి నుంచి రోడ్ షోలు..
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:26 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, తమ జెండా పాతాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఇంకోవైపు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, తమ జెండా పాతాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఇంకోవైపు బీజేపీ కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీల వారికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవనీ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్ షో చేస్తున్నారు. అలాగే కేటీఆర్ కూడా నేటి నుంచి రోడ్‌షోతో రంగంలోకి దిగుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills By Election) బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత (Maganti Sunitha) పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ (Naveen Yadav), బీజేపీ నుంచి దీపక్ రెడ్డి (Deepak Reddy) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS party) దూకుడు పెంచింది. తమ సిట్టింగ్ సీటను ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ శుక్రవారం నుంచి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 7గంటలకు షేక్ పేట్ నాలా నుంచి కేటీఆర్ మొదటి రోజు రోడ్ షో (KTR Road Show) ప్రారంభం కానుంది. ఓయూ కాలనీ , పీస్ సిటీ కాలనీ, శ్రీరామ్ టెంపుల్, సమతా కాలనీ నుంచి.. వినోభానగర్తో రోడ్ షో ముగుస్తుంది. ప్రతి పాయింట్ వద్ద స్థానిక ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
అలాగే ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షో (CM Revanth Reddy Road Show) చేపట్టనున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రూట్‌ను కూడా పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి సీఎం రోడ్ షో ప్రారంభం కానుంది. రహ్మత్‌నగర్ కూడలి, చేపల మార్కెట్, జవహర్‌నగర్ మసీదుగడ్డ ప్రాంతం మీదుగా కృష్ణకాంత్ పార్కు వద్దకు చేరుకుంటుంది. అక్కడ సీఎం ప్రసంగిస్తారు. తర్వాత అక్కడినుంచి యూసఫ్‌గూడ బస్తీ, సారథి స్టూడియో, ఎల్లారెడ్డిగూడకు చేరుకుని.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాట ముచ్చట కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తద్వారా టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు.. అక్కడి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటూ కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను వివరిస్తు్న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను.. మాట ముచ్చట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ తన క్యాడర్‌కు సూచిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన విజయాలను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను మాట ముచ్చట ద్వారా ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ చెబుుతున్నట్లుగా జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్లీ కౌవసం చేసుకుంటారో, లేదా కాంగ్రెస్ జెండా ఎగురుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్