Ministerial Allegations: ప్రభుత్వం.. ఎవరి ఫోన్లూ ట్యాప్ చేయట్లే
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:03 AM
ఫోన్ ట్యాపింగ్‌పై మరో సారి దుమారం రేగింది. ముగ్గురు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొంగులేటి ఖండించారు.

మీ దగ్గర సమాచారం ఉంటే పంపించండి
సీఎంను హౌలే, సన్నాసి అనడం ఏం సంస్కృతి?
నీటి వాటాలు తేల్చకుండా నిద్రపోయింది మీరే
కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజం
ఫోన్ల ట్యాపింగ్ అలవాటు మాకు లేదు: ఉత్తమ్
కేటీఆర్ ఆరోపణలు నిరాధారం: పొంగులేటి
ఘోరంగా ఓడినా.. మీ మాట తీరు మార్చుకోలేదు
ఆత్మవిమర్శ చేసుకోండి.. కేటీఆర్‌పై తుమ్మల ధ్వజం
హైదరాబాద్/ నాగార్జునసాగర్/ఖమ్మం/భద్రాచలం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్‌పై మరో సారి దుమారం రేగింది. ముగ్గురు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొంగులేటి ఖండించారు. అలాగే, రేవంత్‌ను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎవరి ఫోన్లను తమ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేటీఆర్ ఏ సమాచారంతో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఆయన దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించాలని సూచించారు. ‘‘సీఎం స్థాయి వ్యక్తిని హౌలే, సన్నాసి అనడం ఏం భాష? ఏం సంస్కృతి? అధికారం పోయిందనే అక్కసుతో సమాజం సిగ్గుపడేలా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులను సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సరిదిద్దుకుంటూ వస్తున్నారని తెలిపారు. నీటి వాటాలపై పదేళ్ల పాటు ఏమీ తేల్చకుండా, పొరుగు రాష్ట్రం ఎత్తిపోతల పథకాలు కడుతున్నా పట్టించుకోకుండా నిద్రపోయిన వారు.. ఇప్పుడు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
నదీ జలాలపై రాష్ట్రం తరపున గట్టిగా వాదనలు వినిపించామని, కానీ.. తామేదో ఏపీకి ధారాదత్తం చేసినట్టుగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు.. అంటూ నాడు కేసీఆరే మాట్లాడారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం నీటి వాటాల సమస్య వచ్చేదే కాదన్నారు. రాష్ట్రంలో ఏ మంత్రి ఫోనూ ట్యాప్ కావడం లేదని, అలాంటి చట్టవ్యతిరేక చర్యలపై తమకు(తమ ప్రభుత్వానికి) విశ్వాసం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. సొంత కూతురు, అల్లుడు, మంత్రులు, భార్యాభర్తల సంభాషణలను వినడం.. తమ ప్రభుత్వ నైజం కాదని వ్యాఖ్యానించారు. ఫోన్లు ట్యాప్ చేసి వినేంత రహాస్యాలు తమ ప్రభుత్వంలో ఏమీ లేవని అన్నారు. పాలన అంతా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సాగుతోందని, కుట్రలు, కుతంత్రాల డీఎన్‌ఏ తమకు లేదని తేల్చిచెప్పారు. అబద్ధపు ప్రచారంతో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారంటూ కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో, ఇతర ప్రభుత్వాలు, వ్యక్తులు అవే చేస్తున్నారనుకోవడం అవివేకమన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అవే బుద్ధులు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అవే బుద్ధులా.. అంటూ ఘాటుగా విమర్శించారు. భద్రాచలంలో ఆయన మాట్లాడుతూ సీఎం పదవి కోసం తామెవరం ఆశపడడం లేదని, మరో మూడున్నరేళ్లు రేవంతే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ చేయడం నీచమని, అలాంటి పనిని తమ ప్రభుత్వం చేపట్టబోదన్నారు. బీఆర్‌ఎ్‌సలో సంక్షోభాలను ముందుగా పరిష్కరించుకోవాలని, కవిత చెప్పిన కోవర్టులెవరో తేల్చుకోవాలని హితవు పలికారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకోలేదని, ఇంకా మాట తీరు మార్చుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మంలో ఆయన మా ట్లాడుతూ పత్రికల్లో రాయలేని పదాలతో సీఎంను విమర్శించడం కేటీఆర్ అహంకారానికి, దౌర్భాగ్యపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేటీఆర్ చేష్టలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ ఏర్పడుతోందని దుయ్యబట్టారు. ‘మీ కుటుంబంలో మీకే సఖ్యత లేదు.. ఇంటినే సరిచేసుకోలేరు.. రాష్ట్రాన్ని, దేశాన్ని ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరు.. భవిష్యత్తులో మీరు అధికారంలోకి రాలేరు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి