Share News

Nagarjuna Sagar: సాగర్‌ను యజమానికి ఇచ్చేద్దామా?

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:26 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద 2023 నవంబరు 29వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించే అంశంపై చర్చించడానికి త్వరలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలతో సమావేశం కానుంది.

Nagarjuna Sagar: సాగర్‌ను యజమానికి ఇచ్చేద్దామా?

  • త్వరలో తెలుగు రాష్ట్రాలతో కృష్ణా బోర్డు భేటీ

  • ఎన్‌డీఎ్‌సఏ చట్టం ప్రకారం తెలంగాణనే యజమాని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద 2023 నవంబరు 29వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించే అంశంపై చర్చించడానికి త్వరలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలతో సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం తాత్కాలిక నిర్వహణ బాధ్యతలు ఏపీకి అప్పగించగా... నాగార్జునసాగర్‌ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించిన విషయం విదితమే. అయితే, సరిగ్గా 2023 నవంబరు 29న(తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు) ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ప్రభుత్వం.. 500మంది సాయుధ పోలీసుల సాయంతో సాగర్‌లో ఏపీ వైపు ఉన్న భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సాగర్‌ ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి వచ్చింది. దీంతో ఏపీ వైపు విశాఖకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు... తెలంగాణ వైపు ములుగుకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కాపలా కాశాయి.


రెండు రోజుల కిందట రెండు బెటాలియన్ల స్థానంలో ఒక్క బెటాలియన్‌కే రక్షణ బాధ్యతలు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ బలగాలను కూడా రానున్న జూన్‌ కల్లా ఉపసంహరించాల్సి ఉంది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-21 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు యజమానిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు యజమానిగా తెలంగాణ ప్రభుత్వం ఉంటాయని ఇటీవల ఓ సమావేశంలో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది. 2023 నవంబరు 30వ తేదీ నుంచి సాగర్‌ కృష్ణా బోర్డు నియంత్రణలో ఉన్నప్పటికీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) పనులన్నీ తెలంగాణే చూస్తోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించే విషయమై సమావేశం నిర్వహించాలని కృష్ణాబోర్డు బుధవారం నిర్ణయించింది. త్వరలోనే షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక జలదోపిడీ పెరిగిందని, ములుగు బెటాలియన్‌ తొలగింపుతో సాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా ఏపీ చేతుల్లోకి వెళ్లిపోయిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర నిధులు ఢిల్లీకి.. రాష్ట్ర వాటా నీళ్లు ఏపీకి అన్నట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:26 AM