Konda Vishweshwar Reddy: ట్యాపింగ్ ద్వారా రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు!
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:39 AM
కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు
బీఆర్‌ఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి నా ఫోన్ ట్యాపింగ్.. నా భార్య ఫోన్ కూడా
పోలీసులు ఇంట్లో చొరబడి లైవ్ బగ్ పెట్టారు
నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి హస్తం ఉంది
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణ
ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ముందు వాంగ్మూలం
నక్సలైట్ పేరుతో ట్యాపింగ్: రఘునందన్
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన ఆఫీసుకు వారంట్ లేకుండా కొందరు పోలీసు అధికారులు వచ్చి, దౌర్జన్యం చేశారని, అప్పటి నుంచి తన ఇంట్లో సంభాషణలు లైవ్ రికార్డు చేశారని చెప్పారు. తనపై ట్యాపింగ్ వ్యవహారం వెనుక నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సిట్ ఆఫీసుకు 11.45 ప్రాంతంలో వచ్చారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం కొండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 2018లో బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన ఫోన్, భార్య సంగీత ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దీంతో అభద్రతా భావంతో ఎడాపెడా ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారన్నారు. ఎన్నికల సమయాల్లో తనతోపాటు తన ప్రధాన అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారని చెప్పారు. ఎన్నికల సమయంలో తన స్నేహితుడి వద్ద రూ.72 కోట్లు పట్టుకుని అది తన డబ్బుగా చెప్పాలని బెదిరించారని ఆరోపించారు. అదే విధంగా తాను భూమి అమ్మగా కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు చెల్లించాడని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు విషయం తెలుసుకొని, ఆయన్ని బెదిరించి ఒక రాజకీయ పార్టీకి రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రాయించారని చెప్పారు. ఈటెల రాజేందర్‌కు తాను డబ్బు ఇచ్చినట్లుగా నిందలు మోపారని, తాను ఈటెలకు డబ్బు ఇవ్వలేదని, మద్దతు మాత్రమే ఇచ్చానని తెలిపారు. తన ఫోన్లను చట్ట విరుద్దంగా ట్యాప్ చేయడమే కాకుండా ఇలా జరుగుతోందని ఫిర్యాదు చేస్తే వేరే వ్యవహారాల్లో నాన్ బెయిల్‌బుల్ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో బాధ్యులైన అందర్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావిస్తానని చెప్పారు.
రఘునందన్ వాంగ్మూలం తీసుకున్న సిట్
సిట్ అధికారులు ఎంపీ రఘునందన్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కాలుకి స్పల్ప గాయంతో యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రఘునందన్ వద్దకు సిట్ అధికారులు శుక్రవారం రాత్రి వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అంతకుముందు రఘునందన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన సందర్భంగా సిట్‌పై విమర్శలు చేశారు. 2020 నవంబరులో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ మొదలైందని, అప్పటి డీజీపీకి పదిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేశారన్నారు. గాంధీభవన్‌లోని కాంగ్రెస్ సోషల్ మీడియాకు కూడా నోటీసులిస్తూ తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సిట్ రఘునందన్ వాంగ్మూలం తీసుకుంది. రెండు గంటల పాటు ఆయన స్టేట్‌మెంట్ నమోదు చేసుకుంది. ఉదయం పార్టీ కార్యాలయంలో మాట్లాడినపుడు రఘునందన్ సిట్‌కు చిత్తశుద్ధి లేదని, ఉంటే నిందితులను రిమాండ్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిట్‌కు ఇచ్చిన 615 ఫోన్ నెంబర్‌ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక నక్సలైట్ నాయకుడి పేరు రాసి, దాని పక్కన తన ఫోన్ నంబర్ వేసి ట్యాపింగ్ కోసం పంపించారని రఘునందన్ ఆరోపించారు.
రేవంత్ సన్నిహితుడినని నా ఫోన్ ట్యాపింగ్: దేవరాజు
కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి పోటీ చేసినపుడు నియోజకవర్గ బాధ్యతలు తనకు అప్పగించారని, అప్పటి నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేయడం ప్రారంభించిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు దేవరాజు గౌడ్ తెలిపారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందని సిట్ అధికారులు తెలపడంతో దేవరాజు వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
Read Latest Telangana News and Telugu News