Share News

Konda Murali: నేను ఎవరికీ భయపడను!

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:42 AM

తాను ఎవరికీ భయపడనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెప్పారు. పోటా, టాడా కేసులకే భయపడలేదని అన్నారు. తాను ఇప్పటికే క్రమశిక్షణా సంఘం పరిశీలనలో ఉన్నానని..

Konda Murali: నేను ఎవరికీ భయపడను!

  • పోటా, టాడా కేసులకే బెదరలేదు

  • కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు

  • మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

  • మా కూతురు పోటీపై అధిష్ఠానం

  • ఎలా చెబితే అలా: కొండా సురేఖ

  • మీనాక్షికి నివేదిక ఇచ్చిన దంపతులు

వరంగల్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తాను ఎవరికీ భయపడనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెప్పారు. పోటా, టాడా కేసులకే భయపడలేదని అన్నారు. తాను ఇప్పటికే క్రమశిక్షణా సంఘం పరిశీలనలో ఉన్నానని.. కావాలనే కొందరు తనను రెచ్చగొడుతున్నారని చెప్పారు. 44 ఏళ్లుగా తన ఎపిసోడ్‌ నడుస్తూనే ఉందని, పనిచేసే వారిపైనే విమర్శలు ఉంటాయని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు కలిసి 16 పేజీల నివేదికను అందించారు. అనంతరం మురళి మీడియాతో మాట్లాడారు. తాను ఎవరి గురించీ కామెంట్‌ చేయనన్నారు. భయపడుతూ పోతే తనపై 23 కేసులు పెట్టకపోయేవాళ్లని పేర్కొన్నారు. తొలిసారి మీనాక్షి నటరాజన్‌ను కలిశానన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగే సభ గురించి మాట్లాడామని, వరంగల్‌ నుంచి జనసమీకరణపై చర్చించామని తెలిపారు. కాంగ్రె్‌సను బతికించడం, రాహూల్‌గాంధీని ప్రధానిని చేయడం, మరో పదేళ్లు రేవంత్‌రెడ్డిని సీఎంగా కొనసాగేలా చూడడమే తన ముందున్న లక్ష్యాలని చెప్పారు.


బీసీల ప్రతినిధిగానే కొనసాగుతానని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించడం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేలను గెలిపించడమే తన బాధ్యత అని, తాను ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను బీసీ కార్డుపైనే బతుకుతున్నానని, గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదని మురళి చెప్పారు. తన కూతురు సోషల్‌ మీడియా పోస్టులతో తనకు సంబంధం లేదని, ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాత్రం తమ కుమార్తె పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పడంలో తప్పు లేదన్నారు. తను పార్టీ టికెట్‌ ఆశిస్తుందని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటామని తెలిపారు. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉంటుందన్నారు. కాగా, ఇటీవల కొండా దంపతుల కుమార్తె సుస్మిత తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ‘వచ్చే ఎన్నికల్లో పరకాల అభ్యర్థిని నేనే’ అని పెట్టారు. పరకాల ఎమ్మెల్యేతో కొండా దంపతులకు విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో సుస్మిత పోస్ట్‌ పరకాల రాజకీయాల్లో రచ్చరచ్చగా మారింది. మరోవైపు పరకాల ఎమ్మెల్యేపై చేసిన వాఖ్యలపై క్రమశిక్షణ సంఘం కొండా మురళికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సుస్మిత పోస్టు అగ్నికి ఆజ్యం పోసినట్లైందనే చర్చ జరుగుతోంది. దీనిపైనే కొండా దంపతులు మీనాక్షినటరాజన్‌కు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం.


ఇదీ సంగతి..

రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా గత నెల 19న వరంగల్‌లో జరిగిన సభలో కొండా మురళి.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలపై అనుచిత వాఖ్యలు చేశారు. దీనిపై 22న ఎమ్మెల్యేలు, తదితరులు మీనాక్షి నటరాజన్‌తో పాటు క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. జూలై 5లోగా వివరణ ఇవ్వాలని కొండా మురళికి మల్లు రవి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కొండా దంపతులు మీనాక్షికి నివేదిక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిపై పలు ఆరోపణలతో నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి పోస్టింగులు ఇప్పించడం, అభివృద్ధి పనుల్లో పాల్గొనడం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి బొంగు అనే పదాన్ని వాడిన వీడియోను కూడా మీనాక్షికి చూపించినట్లుగా సమాచారం.


ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:42 AM