Share News

Komatireddy Venkat Reddy: కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిస్తాం

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:11 AM

మాజీ సీఎం కేసీఆర్‌ శాసనసభకు వస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు కోరే అన్ని అంశాలు అక్కడ చర్చిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy Venkat Reddy: కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిస్తాం

సభ పెట్టాలంటున్న కేటీఆర్‌, హరీశ్‌ ఫ్లోర్‌ లీడర్లా ?.. వారిద్దరి మాటలకు నేను స్పందించను

  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని కేంద్రమే నిర్మిస్తుంది

  • హ్యామ్‌ రోడ్లతో రాష్ట్ర రూపురేఖలు మారతాయి

  • మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ శాసనసభకు వస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు కోరే అన్ని అంశాలు అక్కడ చర్చిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకుంటామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు, కృష్టా, గోదావరి నదీ జలాలకు సంబంధించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై మంత్రి కోమటి రెడ్డి ఈ మేరకు స్పందించారు. రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో నిర్మించదల్చిన రహదారులపై హైదరాబాద్‌లోని ఆర్‌ అండ్‌ బీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అంటున్న కేటీఆర్‌, హరీశ్‌రావు ఏమైనా ఫ్లోర్‌ లీడర్లా ? అని మండిపడ్డారు. వారిద్దరూ మాజీ మంత్రులని, ప్రస్తుతం ఎమ్మెల్యేలు మాత్రమేనని పేర్కొన్నారు. వాళ్ల మాటలకు తాను స్పందించనని, వారిది తన స్థాయి కాదని మంత్రి స్పష్టం చేశారు. వార్తల్లో కనిపించాలనే హరీశ్‌రావు ఆలోచన లేకుండా మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తోపాటు తన పాత్ర కూడా కీలకమని కోమటిరెడ్డి అన్నారు. కాగా, కేసీఆర్‌ తన హయాంలో ఆర్‌ అండ్‌ బీ శాఖను విస్మరించారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌, యాదగిరిగుట్ట, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. ఆర్‌ అండ్‌ బీ పరిఽధిలో ఓ 42 బ్రిడ్జిలకు అనుమతులిచ్చి వాటికి అప్రోచ్‌ రోడ్లు వేయకుండా నిలిపేశారని, ఫలితంగా ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్‌ దాదాపు రూ.9వేల కోట్లు బకాయిలు పెట్టిందని మంత్రి చెప్పారు.


హ్యామ్‌ రోడ్లకు ఆగస్టులో టెండర్లు

సీఎం రేవంత్‌ సూచనల మేరకు హ్యామ్‌ విధానంలో రహదారుల అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఇందుకోసం కొన్ని రహదారులను గుర్తించామని, 14 ప్యాకేజీలుగా పనులు చేయాలని అధికారులు ప్రాథమికంగా తేల్చారని కోమటిరెడ్డి చెప్పారు. త్వరలోనే వాటిని ఖరారు చేసి ఆగస్టులో టెండరు ప్రక్రియ ప్రారంభించి సెప్టెంబరులో పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ చేస్తున్నామని వివరించారు. హ్యామ్‌ విధానంలో టోల్‌ప్లాజాలు ఉండవని స్పష్టం చేసిన మంత్రి.. ఈ రోడ్లతో రాష్ట్ర రూపురేఖలు మారతాయన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించేందుకు నెలకు 150-200 కోట్లను శాఖకు మంజూరు చేసేలా సీఎం సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం త్వరలో మోదీని కలుస్తా

రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తర, దక్షిణభాగాల అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని త్వరలోనే కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉత్తర భాగంలో ఇప్పటికే 96 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని, టెండర్లను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. దక్షిణభాగానికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం పొందిన అలైన్‌మెంట్‌ను కేంద్రానికి సమర్పించి దాని ప్రకారమే రోడ్డు నిర్మించాలని అడుగుతామని తెలిపారు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని కేంద్రాన్ని కోరతామని, ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు లేఖలు ఇచ్చామని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో దక్షిణ భాగాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.


ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:11 AM