Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:57 AM
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

ట్యాపింగ్‌తో బీఆర్‌ఎస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
పోలీసులే ట్యాప్ చేసి.. వాళ్లే విచారణ చేస్తారా?
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
సుభాష్‌నగర్/ఖమ్మం/హైదరాబాద్/సిటీ/న్యూఢిల్లీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని పదే పదే కోరారని.. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రేవంత్ బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కు కాకపోతే ఆ కేసును వెంటనే సీబీఐకి ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ట్యాపింగ్ విషయంలో బీజేపీ తరఫున హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులే ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇప్పుడు వారి చేతనే విచారణ ఎలా చేయిస్తారని ప్రశ్నించారు.
పసుపు బోర్డు ఏర్పాటు నిజామాబాద్ జిల్లా రైతుల దశాబ్దాల కల అని, కాంగ్రెస్ హయాంలో ఆ డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. పసుపు బోర్డును ప్రారంభించేందుకు 29న కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ వస్తున్నారని తెలిపారు. అదే రోజు డీఎస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలోని బైపా్‌సరోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ డే ఫొటో ఎగ్జిబిషన్‌ను కిషన్ రెడ్డి తిలకించారు. కాగా, నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌లో ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కిషన్ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రారంభోత్సవానికి త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించనున్న రైతు సమ్మేళన సభ ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఇందిర పేరు పెట్టినా.. ఇళ్లకు నిధులిస్తాం: ఎంపీ ఈటల
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో ఇళ్లు నిర్మించినా కేంద్రం వాటికి ఇచ్చే నిధులను ఆపబోదని ఎంపీ ఈటల తెలిపారు. పేదలకు గూడు నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ విధానమని చెప్పారు. గరీబోళ్లకు రేషన్ బియ్యం కూడా కేంద్రమే ఇస్తోందని అన్నారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఈటల పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నాటి ప్రధాని ఇందిరాగాంధీ అపహాస్యం చేశారని, నేడు కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పుస్తకాలను పట్టుకుని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు.
గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాలి: రాజాసింగ్
గో సంరక్షణ కోసం ఏడాది పొడవునా గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. కేవలం బక్రీద్ సమయంలో హడావుడి చేసి ఆ తర్వాత నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. బక్రీద్ సమయంలో గోవధ విషయంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం డీజీపీకి రాజాసింగ్ లేఖ రాశారు. కాగా, కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కైనందున కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదని విమర్శించారు.
ఎంపీ రఘునందన్‌కు భద్రత పెంపు..
మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సాయుధ పోలీసులతో భద్రత కల్పిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎంపీ కాన్వాయ్‌లో ఎల్లప్పుడూ సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్టు వాహనం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News