Kishan Reddy: బీఆర్‌ఎస్ హయాంలో రంగులేసి అభివృద్ధి అన్నారు
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:29 AM
బీఆర్‌ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకొంటూ ప్రచారం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని పనులు చేశారని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీలో వీధి లైట్లు కొనడానికీ డబ్బుల్లేవు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకొంటూ ప్రచారం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని పనులు చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చినపుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ‘‘హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీయే కాదు.. అంబర్ పేట్, సనత్‌నగర్, మల్కాజ్‌గిరి, దిల్ సుఖ్‌నగర్, చార్మినార్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. బేగంపేట్ హరిత ప్లాజాలో జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కిషన్‌రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఆర్థికస్థితి దారుణంగా మారిందన్నారు.
వీధిలైట్లు కొనడానికి కూడా డబ్బుల్లేని స్థితికి దిగజారిందన్నారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విదేశీ పెట్టుబడులను తెచ్చామంటున్నారు. కానీ అవి ఏవి. ఎక్కడికి వెళ్లాయి’’ అని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మజ్లి్‌సకు సహకరిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాం కొడుతున్న రాహుల్ గాంధీ, కేసీఆర్‌లకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీ నుంచి హైదరాబాద్‌ను రక్షించాలంటే ప్రజలు చైతన్యంతో ఓటు వేయాలన్నారు. ప్రజలను జాగృతం చేయాలనే పవిత్ర ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి గౌతంరావు గారిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఐకమత్యంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గౌతం రావు పాల్గొన్నారు.