తవ్వి.. వదిలేశారు
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:56 PM
ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటిగా అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హామీ పద్దు కింద చేపట్టిన పనులకే మోక్షం లేకుండా పోయి వెక్కిరిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటిగా అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హామీ పద్దు కింద చేపట్టిన పనులకే మోక్షం లేకుండా పోయి వెక్కిరిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి హామీలను అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు ఉంటాయి. ముఖ్యమంత్రి హామీ మేరకు చేపట్టిన పనులు ముఖ్యమంత్రి హామీ పద్దు కింద విడుదలైన నిధులతో చేపట్టిన పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికి పూర్తవుతాయి, అవి పూర్తి కావడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు పంపిస్తుంటారు. ఆనవాయితీ ఇలా ఉన్నా కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో చేపట్టిన సీఎం అస్యూరెన్స్ పనులు మధ్యలో ఆగిపోతే పట్టించుకునే వారే లేకుండా పోయారు.
ఫ హడావుడిగా పనులు ప్రారంభం
బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడుఆనాటి జిల్లా మంత్రి గంగుల కమలాకర్ 132.94 కోట్ల రూపాయల అంచనాలతో సీఎం అస్యూరెన్స్ పద్దు కింద 80 అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు మంజూరు చేయించారు. టెండర్ ప్రక్రియను పూర్తి చేసి శ్రీ రాజరాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థకు పనులు అప్పగించారు. ఎన్నికల నాటికి రోడ్లను అభివృద్ధి చేసేందుకు హడావుడిగా పనులు చేపట్టి పలు రోడ్లను తవ్వేశారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినా తవ్విన రోడ్లు తవ్వినట్లుగానే ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడ నిలిచి పోవడంతో ప్రజలు నడవలేక, వాహనాల్లో ఆ రోడ్లపై ప్రయాణించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి అన్ని రోడ్లను తవ్విన ఆనాటి ప్రభుత్వాన్ని, ఆరోడ్లను అసలే పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతూ, విమర్శిస్తూ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ముందుకు కదలని పనులు
132.94 కోట్ల అంచాన వ్యయంతో 80 అంతర్గత రోడ్లలో వాటి అభివృద్ధి వైడనింగ్, మరమ్మతులు, సీసీ వేయడం పైపులైన్లు వేయడం ఉపరితల డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను చేపట్టారు. వీటిలో ప్రస్తుతం 59 పనులు ప్రగతిలో ఉన్నాయని, రెండు పనులు పూర్తయ్యాయని మరో 19 పనులు ప్రారంభించాల్సి ఉందని ఇంజనీరింగ్ విభాగం చెబుతున్నది. పనులు చేపట్టిన ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ 60 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్లు ఎంబీ రికార్డు చేసి బిల్లులు సమర్పించింది. మున్సిపల్ కార్పోరేషన్ 32 కోట్ల చెల్లింపులకు చెక్కు ఇచ్చినా కుబేరాలో ఆ చెక్కుకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడ నిలిపి వేశాడు. ఒక్క ఏజెన్సీకే పనులు అప్పగించడంతో కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అన్ని రోడ్ల నిర్మాణ పనులు ఆగిపోయి 14 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ పార్టీకి, ఎంపీ బీజేపీకి చెందిన వారు కావడంతో ప్రజలు వెళ్లి రోడ్ల పరిస్థితి చెప్పినా వారు అధికార పార్టీ వైపు వేలు చూపిస్తున్నారని అంటున్నారు.
మంత్రులు దృష్టి సారిస్తేనే..
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్‌లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిలిచి పోయిన ఈ అంతర్గత రోడ్ల అభివృద్ధి పనుల విషయం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజక వర్గమైన హుస్నాబాద్‌పై చూపిస్తున్న శ్రద్ధలో పది శాతం కరీంనగర్ నియోజక వర్గంపై పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవని ప్రజలు అంటున్నారు. కాంట్రాక్టర్‌కు జారీ చేసిన 32 కోట్ల చెక్కు పాస్ చేస్తే అతను వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉన్నదని, చేసిన పనులకే బిల్లులు రాని పరిస్థితుల్లో అదనపు పెట్టుబడి పెట్టలేకనే పనులు నిలిపి వేశారని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు అంటున్నారని తెలిసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికైనా కరీంనగర్ కార్పోరేషన్‌పై దృష్టి సారించి నిలచి పోయిన అంతర్గత రోడ్ల పనులను పూర్తి చేయించాలని నగరవాసులు కోరుతున్నారు.