Share News

కొలిక్కి వచ్చిన పునర్విభజన

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:33 AM

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీకి ఇటీవల క్యాబినెట్‌ నిర్ణయించడంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

కొలిక్కి వచ్చిన పునర్విభజన

జగిత్యాల, (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీకి ఇటీవల క్యాబినెట్‌ నిర్ణయించడంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మూడు నెలల వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడం, మరో వైపు పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేయడం అధికారులు ఆ దిశగా ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలల క్రితం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల పునర్విభజనపై తాజాగా తుది కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పెరిగిన కొత్త మండలాల వారీగా ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించారు. తాజాగా జిల్లాలో రెండు ఎంపీపీలు, రెండు జడ్పీటీసీ స్థానాలు, రెండు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.

కొత్త మండలాల వారీగా..

జిల్లాలో పెరిగిన మండలాలకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో భీమారం, ఎండపల్లి మండలాలు కొత్తగా ఏర్పాడ్డాయి. ఈ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. అదే విధంగా గత చివరి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల సమయంలో జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం వాటిని 216కు పెంపు చేశారు. ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని జగిత్యాల అర్బన్‌ మండలంలో ధరూర్‌ - 2 ఎంపీటీసీ స్థానాన్ని పెంపు చేశారు. అదే విధంగా ఎండపల్లి మండలం ఏర్పాటు సందర్భంగా పెద్దపల్లి జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండెడు కలిపిన మూడు గ్రామాల్లో ముంజం పల్లి ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో భీమారం, ఎండపల్లి ఎంపీపీ, భీమారం, ఎండపల్లి జడ్పీటీసీ పదవులతో పాటు ధరూర్‌ - 2 ఎంపీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెరిగినట్లయింది.

రెండేసీ చొప్పున పెరిగిన స్థానాలు

జిల్లాలో గతంలో 18 ఎంపీపీ, 18 జడ్పీటీసీ స్థానాలుండగా కొత్తగా ఏర్పడ్డ భీమారం, ఎండపల్లి మండలాలకు సైతం ఎంపీపీ, జడ్పీటీసీ స్థానా లు ఖరారయ్యాయి. ప్రస్తుత పునర్‌వ్యవస్థీకరణతో 214కు బదులుగా 216 ఎంపీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. 20 మండలాలకు అదే స్థాయిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు కొలువుదీరనున్నారు. పంచాయతీ రాజ్‌ గ్రామీణా భివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకటన జరగగా తుదిజాబితా సైతం ప్రకటించారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సర్పంచ్‌లుగా పోటీ చేయాల నుకునే ఆశావహులు తమ గ్రామ పంచాయతీ, తమ ప్రాదేశిక ప్రాతినిధ్య నియోజకవర్గం ఏ వర్గానికి రిజర్వు చేయబడుతుందననే అయోమయంలో ఉన్నారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తామని ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు రేకెత్తి నట్లయింది. రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు ఉండే అవకాశాలుండటంతో ఆయా పాత స్థానాలకు కొత్త రిజర్వేషన్లు రానున్నాయి. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ వస్తుందో అనే ఉత్కంఠ ఆశావహుల్లో కనిపిస్తోంది.

ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం

బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్‌ జారీ చేసి అనంతరం పరిషత్‌, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా యం త్రాంగం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించనున్నందున ఇప్పటికే బ్యాలెట్‌ పేపర్లను ముద్రించి గో డౌన్‌ లలో భద్రపరిచారు. పోలింగ్‌ కోసం పలు ప్రాంతాల నుంచి తెప్పించిన బ్యాలెట్‌ బాక్సులకు మరమ్మతు చేయించి సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయిన వెంటనే సిబ్బందికి శిక్షణ ఇస్తే సరిపోనుంది. స్థానిక ఎన్నికలపై పీఓ, ఏపీఓలకు శిక్షణ కూడా ఇచ్చారు.

పునర్విభజన పూర్తి చేశాం

- గౌతమ్‌ రెడ్డి, జడ్పీ సీఈఓ, జగిత్యాల

జిల్లాలో పెరిగిన మండలాలకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తి చేశాం. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. అదే విధంగా కొత్తగా ఏర్పడ్డ బీమారం, ఎండపల్లి మండలాలకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు సైతం పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించాం.

Updated Date - Jul 13 , 2025 | 12:33 AM