Share News

క్షయ నివారణే లక్ష్యం

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:02 AM

క్షయ రహిత జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్ర్కీనింగ్‌ చేసి ముందస్తుగా గుర్తిస్తున్నారు.

క్షయ నివారణే లక్ష్యం

జగిత్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): క్షయ రహిత జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్ర్కీనింగ్‌ చేసి ముందస్తుగా గుర్తిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి అలా్ట్రపోర్టబుల్‌ హ్యాండ్‌ హెల్డ్‌ ఎక్సరే సాయంతో స్ర్కీనింగ్‌ చేసి మధుమేహం, బీపీ తదితర వ్యాధులను గుర్తిస్తారు. న్యాట్‌ (న్యూక్లియిక్‌ యాసిడ్‌, యాంప్లిఫికేషన్‌ టెస్టింగ్‌) ఉపయోగించి పలు రకాల వ్యాధులను గుర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జూన్‌ 2 నుంచి 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

వ్యాధుల నిర్ధారణ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య భారత్‌ కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో టీబీ వ్యాధితో పాటు, షుగర్‌, బీపీ, హెచ్‌ఐవీ, ఎనిమియా, వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు సరైన మందులు అందించడం, వ్యాధుల తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రులకు రెఫర్‌ చేసి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తద్వారా వ్యాధుల బారిన పడకుండా ప్రజలను చైతన్య పరచడం, అవగాహన కల్పించడం వంటి పనులు నిర్వహిస్తున్నారు.

అత్యాధునిక పరికరాలతో స్ర్కీనింగ్‌..

జిల్లాలో జూన్‌ 2వ తేదీ నుంచి ప్రారంభించిన కార్యక్రమంలో ఆయా మండలాల్లోని సబ్‌ సెంటర్లలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో రూ.20 లక్షల విలువైన అత్యాధునిక అలా్ట్ర పోర్టబుల్‌ హ్యాండ్‌ హెల్త్‌ ఎక్స్‌రే ద్వారా టీబీతో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టి మెరుగైన చికిత్స కోసం 102 ద్వారా జిల్లా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి 6 నెలల పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెల రూ.వెయ్యి బాధితులకు అందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్య భారత్‌ కోసం చేపట్టిన ఈ కార్యక్రమం రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతోంది.

జిల్లాలో ఇప్పటికే 139 క్యాంపులు

జిల్లాలో సుమారు 10 లక్షల జనాభా ఉండగా ఇందులో 2,14,200 జనాభాను రిస్క్‌గా గుర్తించారు. గతంలో టీబీ వ్యాధి వచ్చిన వ్యక్తులు, షుగర్‌ ఉన్న వ్యక్తులు, ఆల్కహాల్‌, సిగరెట్‌ స్మోకర్స్‌, బీఎంఐ శాతం తక్కువగా ఉన్న వ్యక్తులు, హెచ్‌ఐవీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, దగ్గు, జ్వరం లక్షణాలు గల వ్యక్తులను గుర్తించి రిస్క్‌ జనాభా కేటగిరిలో చేర్చారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్ల వారీగా శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 139 వైద్య శిబిరాలు నిర్వహించారు. ఇందులో జూన్‌ మాసంలో 81, జూలై మాసంలో ఇప్పటివరకు 58 వైద్య శిబిరాలు నిర్వహించారు. సుమారు 30 వేల మందికి టీబీ పరీక్షలు నిర్వహించారు. అలా్ట్ర ఫోర్టబుల్‌ హ్యండ్‌ హెల్త్‌ ఎక్సరే ద్వారా 2,890 పరీక్షలు నిర్వహించారు. హెపటైటిస్‌ పరీక్షలు 3,860 మందికి నిర్వహించారు. వీటితో పాటు వీడీఆర్‌ఎల్‌, బీపీ, షుగర్‌ పరీక్షలు చేపట్టి పాజిటివ్‌ రోగులను గుర్తించారు. ప్రస్తుత యేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు టీబీ వ్యాధి గ్రస్తులను 1,097 మందిని గుర్తించారు. వీరికి ప్రతి నెల రూ.1000 అందించాల్సి ఉన్నా బడ్జెట్‌ లేమి కారణంగా వీరికి అందడం లేదు. దాతల సహాయంతో అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:02 AM