Share News

పంచాయతీలపై ప్రత్యేక వ్యూహం

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:56 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సగానికిపైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను, పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రూపొందిస్తున్నది. ప్రధానంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని స్థానాలపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.

పంచాయతీలపై ప్రత్యేక వ్యూహం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

స్థానిక సంస్థల ఎన్నికల్లో సగానికిపైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను, పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రూపొందిస్తున్నది. ప్రధానంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని స్థానాలపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్‌ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను సాధించడం ద్వారా పట్టు నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 50 నుంచి 60 శాతం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను, ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మండలాల వారీగా కమిటీలు

గ్రామాలవారీగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి జాబితాను రూపొందించేందుకు మండలాలవారీగా కమిటీలను వేశారు. ఆయా కమిటీలు ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ సామాజికవర్గం బలంగా ఉంది, ఏ సామాజికవర్గం పార్టీకి అనుకూలంగా ఉంది తదితర వివరాలు సేకరిస్తున్నాయని సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి సంజయ్‌ కుమార్‌ సర్వే టీంలను కూడా రంగంలోకి దింపారని తెలిసింది. అభ్యర్థులుగా ఎవరిని నిలిపితే బాగుంటుంది, వారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, ఎన్నికల్లో ప్రభావితం చేయబోయే అంశాలేమున్నాయి అనే అంశాలపై సర్వే టీంలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సర్వే టీంలు ఇచ్చే నివేదికలు, పార్టీ నియమించిన ప్రతినిధుల బృందాల నివేదికలు పరిశీలించి ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లను ఖరారు చేయాలని మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

బండి సంజయ్‌కమార్‌ ఇప్పటికే జిల్లా ముఖ్య నేతలతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పర్యటన సందర్భాల్లో ఆయా స్థానిక నేతలతో సమావేశమై కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరిస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇవ్వకుండా పంచాయతీలను కుంటుపడేలా చేశాయని తెలుపుతున్నారు. 18 నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, చేసిన పనులకు బిల్లులురాక మాజీ సర్పంచులు ఆందోళన చెందుతున్నారని వివరిస్తున్నారు. కార్యకర్తల సమావేశాల్లోనూ వివిధ అంశాలను వివరించి, కేంద్రం విడుదల చేసిన నిధులను, వాటితో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఆయన సూచించిన మేరకు గ్రామ, మండలస్థాయి బీజేపీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ప్రధాని మోదీ చరిష్మా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలనే బీజేపీ అస్ర్తాలుగా వాడుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో చాంపియన్‌గా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jul 27 , 2025 | 12:56 AM