Share News

సెక్రెటరీలు కావలెను

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:54 PM

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు సైతం ఇన్‌చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. ఒక్కో సెక్రెటరీకి మూడు, నాలుగు మార్కెట్ల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు.

సెక్రెటరీలు కావలెను

జగిత్యాల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు సైతం ఇన్‌చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. ఒక్కో సెక్రెటరీకి మూడు, నాలుగు మార్కెట్ల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. దీంతో మార్కెట్‌ కార్యదర్శులు అదనపు భారంతో సరియైున విధంగా బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నారు.

ఫమార్కెట్‌లలో ఖాళీగా 36 పోస్టులు

జిల్లాలోని 13 వ్యవసాయ మార్కెట్లలో 48 పోస్టులు మంజూరు కాగా 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్లలో సెక్రెటరీతో పాటు అసిస్టెంట్‌ సెక్రెటరీ, అటెండర్‌, జూనియర్‌ మార్కెట్‌ ఆఫీసర్‌, మార్కెట్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీసీ, అకౌంటెంట్‌, టైపిస్టు వివిధ పోస్టులు ఉండాలి. పలు పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల పనిభారం అధికమై అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పరంగా జిల్లా ముందు వరుసలోనే ఉంటుంది. దాదాపుగా అన్ని మార్కెట్లు ఆయా సీజన్లలో పంట ఉత్పత్తులతో కళకళలాడుతుంటాయి. మార్కెట్‌లో పర్యవేక్షణ కరువైంది. రెగ్యులర్‌ సెక్రెటరీలు ఉన్నట్లయితే ఎప్పటిప్పుడు రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. పంట కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని నియంత్రిస్తారు. కానీ ఇన్‌చార్జీల పాలన ఉండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారిగా ఉన్న ప్రకాశ్‌ సైతం సిరిసిల్ల, కరీంనగర్‌ తదితర జిల్లాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫఒక్కో కార్యదర్శికి మూడింటి బాధ్యతలు

జిల్లాలో 13 మార్కెట్‌ కమిటీలు ఉండగా కేవలం ముగ్గురు మార్కెట్‌ కార్యదర్శులు మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన మార్కెట్‌ కమిటీల్లో ఇన్‌చార్జీల పాలన కొనసాగుతోంది. జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజశేఖర్‌ స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రెటరీగా పదోన్నతికి దగ్గరలో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కోరుట్ల మార్కెట్‌లో సెక్రెటరీగా ప్రశాంత్‌, మెట్‌పల్లి మార్కెట్‌లో సెక్రెటరీగా ఇంద్రసేనరెడ్డిలు మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన పది మార్కెట్‌ కమిటీలలో ఇన్‌చార్జీలు పనిచేస్తున్నారు. మల్యాల అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న వరలక్ష్మీ జిల్లాలోని గొల్లపల్లి, పెగడపల్లి మార్కెట్‌లకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాల సెక్రెటరీ రాజశేఖర్‌ రాయికల్‌ మార్కెట్‌ సెక్రెటరీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మెట్‌పల్లి మార్కెట్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న హరికృష్ణ వెల్గటూరు ఇన్‌చార్జీ సెక్రెటరీగా, మేడిపల్లి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సురేందర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ ఇన్‌చార్జీ సెక్రెటరీగా, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి అసిస్టెంట్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న రమణ జిల్లాలోని మేడిపల్లి, కథలాపూర్‌ ఇన్‌చార్జీ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ధర్మపురిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వెంకటనర్సయ్య అక్కడే ఇన్‌చార్జీ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫవ్యాపారులదే ఇష్టారాజ్యం

జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్లలో కార్యదర్శులు, ఇతర అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండడం, ఇన్‌చార్జీల పాలన కొనసాగుతుండడంతో మార్కెట్లలో వ్యాపారులు, అడ్తీదారులు, ఖరీదుదారులు, కమీషన్‌ ఏంజట్లదే ఇష్టారాజ్యంగా తయారైంది. వ్యవసాయ మార్కెట్లలో నిబంధనల మేరకు కొనుగోళ్లు, చెల్లింపుల ప్రక్రియ జరగాల్సి ఉండగా అడుగడుగున రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు అయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలతో పాటు ఇతర మార్కెట్లలో తక్‌పట్టీల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నగదు కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులపై ఒక్కశాతం పన్నును మార్కెట్‌కు కట్టాల్సి ఉంటుంది. చాలా వరకు జీరో వ్యాపారం జరుగుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. మెట్‌పల్లి మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లలో ఈ నామ్‌ అమలు అంతంత మాత్రమేనని విమర్శలున్నాయి. జగిత్యాల మార్కెట్‌లో మామిడి కొనుగోళ్లు అధిక శాతం జీరోలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌ యార్డుల్లో సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, జూనియర్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. అధికారులు, సిబ్బంది సరియైున సంఖ్యలో లేకపోవడం, ఉన్న పోస్టులు ఖాళీగా ఉండడం, ఇన్‌చార్జీల పాలనతో అటు రైతులకు నష్టం జరుగుతుండగా, ఇటు మార్కెట్‌ కమిటీలు సైతం ఆదాయాన్ని కోల్పోతున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో ఖాళీల ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి.

ఖాళీలను ఉన్నతాధికారులకు నివేదించాం

-ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ఖాళీ పోస్టుల పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించాం. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మార్కెటింగ్‌ శాఖలో దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొత్త పోస్టులు మంజూరు, ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి సారించాం. ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులతో మార్కెట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం.

Updated Date - Apr 19 , 2025 | 11:54 PM