ప్రచార వ్యూహాల్లో పంచాయతీ అభ్యర్థులు
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:17 AM
పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు రాత్రి వరకు 773 నామినేషన్లు రాగా వార్డులకు 2,243 వచ్చాయి.
జగిత్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు రాత్రి వరకు 773 నామినేషన్లు రాగా వార్డులకు 2,243 వచ్చాయి. ఈనెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. డిసెంబరు 1వ తేదీన అప్పీళ్ల స్వీకరణ, డిసెంబరు 2వ తేదీన అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబరు 3వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ, అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల ప్రకటన, డిసెంబరు 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
ఫరాత్రి వకు కొనసాగిన నామినేషన్లు...
జిల్లాలోని పలు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. పలు గ్రామాల్లో పోటీ చేయడానికి పదుల సంఖ్యలో అభ్యర్థులుండడంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్ల గడువు ముగిసింది. ఆ సమయానికి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి నామినేషన్ల దాఖలు అనుమతిచ్చారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం క్లస్టర్‌తో పాటు పలు ప్రాంతాల్లో రాత్రి పూట నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి
పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, పంచాయతీ అభ్యర్థులు వ్యూహరచన జరుపుతున్నారు. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రకియ పూర్తి కావడం, నామినేషన్ల ఉపసంహరణ, గుర్తులు కేటాయించనుండడం వంటి పనులు మిగిలి ఉండడం, ప్రచారానికి కొద్ది రోజులు గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రదానంగా ప్రచారం వైపు దృష్టి సారిస్తున్నారు. అభ్యర్థులు ఏర్పాటు చేసుకోవల్సిన ప్రచార సామాగ్రిని గ్రామస్థాయి నాయకులకు నియోజకవర్గ స్థాయి నేతలు వివరిస్తున్నారు. ఓటర్లను ఆకర్శించడానికి పలు విషయాలను వివరిస్తూ ఇప్పటి వరకు తమ పార్టీ ప్రజాప్రతినిధులు జరిపిన అభివృద్ధిని గుర్తు చేయడానికి పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పోలింగ్‌బూత్‌ల వారిగా బాధ్యులను నియామకం చేసి ఎప్పటికప్పుడు ప్రచారాన్ని పర్యవేక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తమతమ వర్గానికి అనుకూలంగా ఉండే గ్రామానికి చెందిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను బూత్‌ల వారిగా బాధ్యులుగా ఉంచడానికి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆయా పోలింగ్ బూత్‌ల వారిగా గల ఓటర్లకు పలు విషయాలు వివరించి ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పంచాయతీలోని బీడీ కార్మికులు, స్త్రీలు, మైనారిటీ ఓటర్లను ఆకర్శించడానికి అనుగుణంగా అభ్యర్థులు వ్యూహరచన జరుపుతున్నాయి. ప్రచారం తీరు, వినియోగించాల్సిన వాహనాలు, బాధ్యులు చేయాల్సిన పనులను అంచనా వేస్తున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో గ్రామంలోని అన్ని వార్డులను కలుపుకొని ప్రచారం జరుపడానికి పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర పక్షానికి చెందిన పార్టీల కార్యకర్తలు, నాయకులను బుజ్జగిస్తూ తమవైపు తిప్పుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను అభ్యర్థులు పరిశీలిస్తున్నారు.
ఫమలి విడతలో 144 పంచాయతీలు
ఈనెల 30వ తేదీ నుంచి మలి విడత నామినేషన్ల పర్వం మొదలు కానుంది. రెండో విడత నామినేషన్లను ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ సాయ్రంతం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్ల ప్రకటన, 4వ తేదీ వరకు అప్పీల్, 5వ తేదీన అప్పీల పరిష్కారం, 6వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, డిసెంబరు 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మద్యాహ్నాం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.
-------------------------------------------------------------------
మలి విడత మండలాలు - పంచాయతీలు - వార్డులు- పోలింగ్ స్టేషన్లు - ఓటర్లు
-------------------------------------------------------------------
1. జగిత్యాల - 5 - 50 - 50 - 9,727
2. జగిత్యాల రూరల్ - 29 - 26 - 268 - 46,020
3. రాయికల్ - 32 - 276 - 276 - 39,412
4. సారంగపూర్ - 18 - 144 - 144 - 20,466
5. బీర్‌పూర్ - 17 - 136 -136 - 17,738
6. మల్యాల - 19 - 186 - 186 - 40,307
7. కొడిమ్యాల - 24 - 216 - 216 - 38,422
-------------------------------------------------------------------
మొత్తం - 144 - 1,276 - 1,276 - 2,12,092
-------------------------------------------------------------------