Share News

బీసీ సభలతో ప్రజల్లోకి

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:54 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి తిరిగి అధికారంవైపునకు అడుగులు వేయాలని బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తోడుగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకొని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను, పంచాయతీలను కైవసం చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహం రూపొందిస్తున్నది.

బీసీ సభలతో ప్రజల్లోకి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి తిరిగి అధికారంవైపునకు అడుగులు వేయాలని బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తోడుగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకొని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను, పంచాయతీలను కైవసం చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహం రూపొందిస్తున్నది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయగా రాష్ట్ర గవర్నర్‌ దానిని న్యాయ సలహా కోసం కేంద్రానికి పంపించారు. ఈ వివాదం నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని రాజకీయ అస్త్రంగా మల్చుకుని బీసీలను పూర్తిగా తమ ఖాతాలోనే జమ కట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలని పార్టీ అధిష్టానవర్గం నిర్ణయించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం కరీంనగర్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఫ కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా

పార్టీ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌ నుంచే బీసీ సభలకు శ్రీకారంచుట్టాలని భావిస్తున్నారు. సింహగర్జన సభతో తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ నుంచే శంఖం పూరించిన కేసీఆర్‌ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు తదితర పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఉద్యమకాలంలో కూడా తన ఆమరణ దీక్షకు ఇక్కడ నుంచే తరలివెళ్లారు. ఇక్కడ నుంచే తొలుత పార్లమెంట్‌ సభ్యుడిగా గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు తనకు అన్నివిధాలుగా తోడ్పాటుగా ఉంటున్న జిల్లా నుంచే బీసీ సభలకు కూడా శ్రీకారంచుట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నెల 8న కరీంనగర్‌లో బీసీ సభను నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ సభలో కేసీఆర్‌, కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారని చెబుతున్నారు. సభను విజయవంతం చేసే బాధ్యత మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై ఉంచారు. మాజీ స్పీకర్‌, ప్రస్తుత శాసనమండలి బీఆర్‌ఎస్‌ పక్ష నేత మధుసూదనాచారి, శాసనమండలి మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్‌, మాజీ మంత్రులు, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, కోరుట్ల శాసనసభ్యుడు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌ రెడ్డి, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితర నేతలతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ క్రియాశీలనేతలు సమావేశానికి హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న సభను విజయవంతం చేయడం ద్వారా బీసీలను బలమైన మద్దతుదారులుగా మల్చుకోవాలని అలాగే బీజేపీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి పెంచి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయడం ద్వారా బీసీలపట్ల బీఆర్‌ఎస్‌ మొదటి నుంచి అంకితభావంతో ఉందని చాటుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది.

మెజారిటీ స్థానాలే లక్ష్యం

బీసీల అండదండలతో స్థానిక సంస్థలైన పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ మెజార్టీ స్థానాలను సాధించి మండల పరిషత్‌లను, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవాలని, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తాము స్థానిక సంస్థల్లో విజయం సాధించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదిగి ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ సాధించి పూర్వవైభవాన్ని పొందాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం జిల్లాలో కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, కోరుట్లలో కూడా పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగిత్యాల స్థానాన్ని బీఆర్‌ఎస్‌ గెల్చుకున్న ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి చేరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న బీఆర్‌ఎస్‌ గతంలో మాదిరిగా మెజార్టీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు బీసీ సభలకు శ్రీకారంచుట్టి వాటిని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. కరీంనగర్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఈ దిశగా పనిచేసేందుకు అన్ని నియోజకవర్గాల నాయకులకు బాధ్యతలు అప్పగించి జన సమీకరణకు సూచనలిచ్చారు.

Updated Date - Aug 02 , 2025 | 12:54 AM