వానమ్మా.. రావమ్మా..
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:56 AM
వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద రైతులు మాత్రమే వరినాట్లు మొదలు పెట్టారు. మెట్ట ప్రాంతంలోని రైతులు నీళ్లు లేక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

హుజూరాబాద్/రామడుగు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద రైతులు మాత్రమే వరినాట్లు మొదలు పెట్టారు. మెట్ట ప్రాంతంలోని రైతులు నీళ్లు లేక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్‌లోని సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం, ఇల్లందకుంట మండలాల్లో వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. ఒక్క భారీ వర్షం కురవకపోవడంతో బావులు, చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
ముదురుతున్న వరి నారు
ప్రతి సంవత్సరం జూలైలో వ్యవసాయ పనులు ఊపందుకునేవి. ఇప్పటికే 50 శాతం వరినాట్లు పూర్తయ్యేవి. ఇప్పటి వరకు రైతులు పోసిన నార్లు ముదిరిపోతున్నాయి. నార్లు పోస్తే నెల రోజుల్లో నాట్లు వేయాలి. పొలాలకు సరిపడా నీళ్లు లేక వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్‌లో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు. 80 వేల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. ఇప్పటి వరకు 40 శాతం ఆయకట్టు కింద రైతులు వరినాట్లు వేశారు.
రామడుగు మండలంలో 28 వేలకుపైగా వ్యవసాయ భూమి ఉండగా గత ఖరీఫ్‌లో 23,418 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, తదితర పంటలు సాగు చేశారు. ఈ యేడు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మండలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటివరకు 168.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 117.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం తక్కువ నమోదు కావడంతో ఇప్పటి వరకు మండలంలో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరలేదు. మండలంలో 11 చెరువులు, 63 కుంటలు ఉన్నాయి. మండలంలో 25 శాతం మాత్రమే వరి నాట్లు వేశారు. వ్యవసాయ బావులు, బోర్లలో నీరు అడుగంటింది. దీంతో రైతులు ఆకాశం వైపు చూస్తూ చూస్తున్నారు.