Share News

కరీంనగర్‌ : బండి వర్సెస్‌ ఈటల

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:04 AM

బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

కరీంనగర్‌ :  బండి వర్సెస్‌ ఈటల

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా శనివారం శామీర్‌పేటలో తన నివాసానికి వచ్చిన హుజూరాబాద్‌ బీజేపీ అసంతృప్త నేతలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నవారినుద్దేశించి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ అసలు నువ్వెవరు, నీ శక్తి ఎంత, నేను 2002లో జిల్లాకు వచ్చాను, మంత్రిగా పనిచేశాను, నేను అడుగుపెట్టని గ్రామం లేదు, ఖబర్దార్‌ బిడ్డా అంటూ హెచ్చరించాడు. సైకోగాడు, చిల్లరగాడు అంటూ సంబోధించిన మాటలు రాజకీయంగా జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అదే క్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో రాజకీయంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారినుద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

అధిష్ఠానం వైపు.. అందరి చూపు..

రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్‌ కోరుకున్నారు. ఈటలకు ఆ పదవి దక్కకుండా బండి సంజయ్‌కుమార్‌ అడ్డుపడ్డారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నవారి గురించి, ఆ పోస్టుల గురించి అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని రాజేందర్‌ అన్నారు. ఈ వ్యవహారంపై ఎవరు స్పందించవద్దు, దీనిని అధిష్ఠానమే చూసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌కు చెందిన నేతలకు సూచించారు. వీరిద్దరి మధ్య విభేదాలు బీజేపీ కేంద్ర నాయకత్వ దృష్టికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ అగ్రనేతల మధ్య విబేధాలకు ఏరకమైన ముగింపు వస్తుందోనని బీజేపీలో చర్చ ప్రారంభమయింది.

ఫ ఈటల బీజేపీలో చేరిన నాటి నుంచే విభేదాలు

బీఆర్‌ఎస్‌ నుంచి వైదొలిగిన తర్వాత ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారు. ఆ సమయం నుంచే ఈటలకు బండి సంజయ్‌ కుమార్‌కు మధ్య సత్సంబంధాలు లేవనే ప్రచారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా, కరీంనగర్‌ ఎంపీగా సంజయ్‌ కుమార్‌ ఉన్న సమయంలో ఈటల రాష్ట్ర మంత్రిగా, హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో రాజేందర్‌ బండి సంజయ్‌ కుమార్‌ను అంతగా పట్టించుకునేవారు కాదని, అది మనసులో పెట్టుకున్న సంజయ్‌ కుమార్‌ బీజేపీలోకి వచ్చిన తర్వాత రాజేందర్‌ను దూరం పెట్టారని పార్టీలో ప్రచారం జరిగింది.

పరస్పర ఆరోపణలు

రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల సందర్భంలో ఆ తర్వాత జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బండి సంజయ్‌ అనుచరులుగా ఉన్న పాత బీజేపీ కార్యకర్తలెవరు సహకరించలేదని, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాత్రమే నామమాత్రంగా తిరిగారని ఈటల వర్గీయులు ఆరోపించారు. ఎంపీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే బండి సంజయ్‌కుమార్‌కు తక్కువ మెజార్టీ వచ్చేలా ఈటల చూశారని సంజయ్‌ వర్గీయులు ఆరోపించారు. ఇలా మొదలైన విభేదాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్‌ ఆశించిన సమయంలో తారాస్థాయికి చేరాయి. చివరి క్షణం వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ పేరు ఖరారైందని ప్రచారం జరిగి తెల్లారేసరికి రాంచందర్‌రావును ఆ పదవికి ఎంపిక చేసినట్లు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేబినేట్‌ అనుమతితోనే ప్రాజెక్టును చేపట్టారంటూ ఈటల రాజేందర్‌ మాట్లాడగా ఆ సమయంలో మొదటి నుంచి పార్టీ తీసుకున్న లైన్‌కు ఆయన మాటలు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమయింది. ఇదే సందర్భంలో బండి సంజయ్‌ కుమార్‌ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరూ వ్యక్తిగత ఎజెండాలతో మాట్లాడవద్దని, బీజేపీలో సొంత ఎజెండాలు ఉండవని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సమర్థించడం తప్పని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య మరింత అగాధాన్ని పెంచింది.

ప్రాధాన్యం దక్కడం లేదని..

రాష్ట్ర అధ్యక్ష పదవిని రాకుండా చేయడంతోపాటు సోషల్‌ మీడియాలో తనకు వ్యతిరేకంగా, తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా పెడుతున్న పోస్టుల వెనుక బండి సంజయ్‌కుమారే ఉన్నారని ఈటల వర్గం భావిస్తోంది. తప్పుడు ఆలోచనలతో, అపోహలతో ఈటల రాజేందరే సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నారని సంజయ్‌కుమార్‌ వర్గం ఆరోపిస్తోది. ఈటల రాజేందర్‌కు, ఆయన అనుచరులకు బీజేపీలో ప్రాధాన్యం లభించడం లేదనే కారణంతో శామీర్‌పేటలో సమావేశమవడం సమంజసం కాదని బండి సంజయ్‌ వర్గీయులు విమర్శిస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ పదవుల్లో సగానికిపైగా ఈటల వర్గీయులే ఉన్నారని, పార్టీలో చేరిన నాటి నుంచి బీజేపీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం రెండు అసెంబ్లీ సీట్లలో పోటీచేసే అవకాశం కల్పించిందని వారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఎంపీగా అవకాశం ఇచ్చి గెలవగానే పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా, పార్టీలో జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించిందని గుర్తు చేస్తున్నారు. అయినా ప్రాధాన్యం లభించడం లేదనడం ఎంతవరకు సమంజసమని బండి సంజయ్‌కుమార్‌ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శామీర్‌పేటలో ఈటల రాజేందర్‌ మాట్లాడిన మాటలు పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం దీనికి ఎలాంటి ముగింపు పలుకుతుందోననే ఆసక్తి అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 20 , 2025 | 01:04 AM