Share News

దివ్యాంగులకు చేయూత

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:54 AM

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలవడానికి మరోమారు వాహనాలు, పరికరాలు పంపిణీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలకు రూ.4,016 పింఛన్‌, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరింత బాసటగా నిలువడానికి ప్రయత్నం చేస్తోంది.

దివ్యాంగులకు చేయూత

జగిత్యాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలవడానికి మరోమారు వాహనాలు, పరికరాలు పంపిణీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలకు రూ.4,016 పింఛన్‌, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరింత బాసటగా నిలువడానికి ప్రయత్నం చేస్తోంది. దివ్యాంగులకు స్కూటీలు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ల్యాప్‌టాప్స్‌, ఇతర పరికరాలు అందజేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా వారీగా టార్గెట్లు సూచించారు. జిల్లాకు 288 యూనిట్లు మంజూరు అయ్యాయి. ఈ మేరకు జూన్‌ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 751 దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్‌ కన్వీనర్‌గా, జిల్లా సంక్షేమాధికారితో పాటు, వైద్యారోగ్యశాఖ, రవాణాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా అర్హులను ఎంపిక చేసి పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఎంపిక ఇలా...

వచ్చిన దరఖాస్తుల్లో 40 శాతం అంగవైకల్యం, కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యే డిగ్రీ, పీజీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో 33 శాతం మహిళలకు కేటాయిస్తారు. వీటితో పాటు పదో తరగతి మెమో ఆధారంగా 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు. అలాగే ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన యూనిట్లు అందజేస్తారు. ఇందుకోసం బోనఫైౖడ్‌, నివాసం, కుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తారు. కలెక్టర్‌ ఆమోదం పొందిన తర్వాత జాబితా ప్రకటించి పరికరాలు అందజేస్తారు.

మధ్యవర్తుల రంగప్రవేశం

ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు తాము ఉచితంగా వాహనాలు, పరికరాలు ఇప్పిస్తామని పలువురు మధ్యవర్తులు దరఖాస్తుదారులతో బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా స్కూటీలు, బ్యాటరీ ట్రె సైకిళ్లకు ఎక్కువ దరఖాస్తులు రావడం, వాటి విలువ కూడా ఎక్కువగానే ఉండటంతో తమకు డబ్బులు ఇస్తే యూనిట్‌ ఇప్పిస్తామని మభ్యపెడుతున్నట్లు సమాచారం. దీంతో అన్ని అర్హతలు ఉండి తమకు స్కూటీ, ఇతర యూనిట్లు వస్తాయని ఆశ పడుతున్న దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

పారదర్శకంగా ఎంపిక

-బోనగిరి నరేశ్‌, జిల్లా సంక్షేమ అధికారి

ప్రతీ పరికరం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తాం. కమిటీ పూర్తి స్థాయిలో సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే నిజమైన లబ్ధిదారులకు యూనిట్లు అందజేస్తాం. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. కలెక్టర్‌ ఆమోదం పొందిన తర్వాత జాబితా ప్రకటించి యూనిట్లు పంపిణీ చేస్తాం.

------------------------------------

పరికరాలు.. వచ్చిన దరఖాస్తులు...జిల్లాకు కేటాయించినవి

------------------------------------------------------------------------------------------------------

5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ - 45 - 3

బ్యాటరీ మినీ ట్రేడింగ్‌ ఆటో వెహికిల్‌ - 94 - 2

బ్యాటరీ ఆపరేటెడ్‌ వీల్‌ చైర్‌ - 89 - 20

క్రచెస్‌ - 23 - 33

హియరింగ్‌ హెడ్స్‌ - 14 - 3

హియరింగ్‌ హెడ్స్‌ (బీటీఈ) - 4 - 0

హైబ్రిడ్‌ వీల్‌ చైర్‌ - 17 - 7

ల్యాప్‌ట్యాప్‌ - 21 - 10

ల్యాప్‌ ట్యాప్‌ డిగ్రీ స్టూడెంట్స్‌ - 11 - 22

మొబైల్‌ బిజినెస్‌ బ్యాటరీ ట్రైసైకిల్‌ - 41 - 26

రెట్రో ఫిటెడ్‌ స్కూటీ - 293 - 66

ట్యాబ్స్‌ - 5 - 16

ట్రైసైకిల్స్‌ - 62 - 8

వీల్‌ చైర్స్‌ - 32 - 8

వాకింగ్‌ స్టిక్స్‌ - 0 - 33

స్మార్ట్‌ కేన్స్‌ - 0 - 16

యంసీఆర్‌ చెప్పల్స్‌ - 0 - 16

-------------------------------

మొత్తం...751 - 289

----------------------------------

Updated Date - Jul 27 , 2025 | 12:54 AM